అమరుల త్యాగాలను మరిచిన కేసీఆర్.. బక్క జడ్సన్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఇంకా వేయి అమరవీరుల త్యాగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మరిచారని కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఇంకా వేయి అమరవీరుల త్యాగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మరిచారని కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ మండిపడ్డారు. గురువారం బక్క జడ్సన్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఉద్యమ కారులు జర్నలిస్ట్ విఠల్, రఘులతో కలిసి గన్‌పార్క్‌లోని అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బక్క జడ్సన్ మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం, పామునూరు చెందిన కళకుల కొమురయ్య తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానం ప్రజలు కేంద్రంగా, ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కాక ప్రజలను సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానో, కేవలం ఓటర్లుగానో పరిగణించే తీరులో ఉన్నదని గుర్తుచేసుకోక తప్పదన్నారు. సకల జనుల ఉద్యమ చైతన్యంతో అధికారంలోకి వచ్చినట్లు కాకుండా, తెలంగాణ రాష్ట్ర సమితి వల్లనే రాష్ట్రం ఏర్పాటు జరిగినట్టుగా, తానే స్వరాష్ట్ర సృష్టికర్తగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమిష్టి ఫలమైన రాష్ట్రంలో సర్వమూ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ అధినేత పై ఒత్తిడి తేగల శక్తి ఏదీ వెలుపల లేకుండా పోవడం ఈ దశాబ్ది వైఫల్యమేనని బక్క జడ్సన్ అభిప్రాయపడ్డారు.