తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్.. ఆశావహుల మధ్య పోటీ?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో పీసీసీ చీఫ్ మార్పుపై ఏఐసీసీ దృష్టి పెట్టింది.

Update: 2023-12-23 02:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో పీసీసీ చీఫ్ మార్పుపై ఏఐసీసీ దృష్టి పెట్టింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన వ్యవహారాలపైనే దృష్టి కేంద్రీకరించే వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి సక్సెస్ అయ్యారనే కోణం నుంచి లోక్‌సభ ఎన్నికలు ఆయన చేతుల మీదుగా జరిపించడం సహేతుకంగా ఉంటుందనే అభిప్రాయాలూ ఉన్నాయి.

ఎన్నికల దాకా వేచిచూసే ధోరణి

లోక్‌సభ ఎన్నికల్లో కనీసంగా డజను స్థానాల్లో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నందున ఇప్పటికిప్పుడు పార్టీ నాయకత్వంలో మార్పులు చేసే ప్రయోగంపైనా ఏఐసీసీ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత కార్యాచరణ మొదలుపెడితే పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు తక్కువని, ఆ తర్వాత నేతల్లో అసంతృప్తి లాంటివి వచ్చినా సర్దిచెప్పడానికి తగినంత వెసులుబాటు ఉంటుందనే ఫీడ్‌బ్యాక్ వెళ్లింది. బీసీ నేతకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని సూత్రప్రాయంగా ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నా ఎవరికి ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందనేది కూడా ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు.

ఆశావహుల మధ్య పోటీ

అసెంబ్లీ టికెట్‌ను త్యాగం చేసినవారు, ఇప్పటికే సెకండ్ ర్యాంక్‌లో ఉన్న వారు, పార్టీ అగ్రనేతలకు లాయల్‌గా ఉన్నవారు పీసీసీ కోసం పోటీలో ఉన్నారు. తాజాగా ఏఐసీసీ నుంచి సీనియర్ నేత ఒకరు రాష్ట్ర లీడర్‌తో ఫోన్‌లో మాట్లాడి పీసీసీ చీఫ్ మార్పుపై చర్చించడంతో మరోసారి ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పటికిప్పుడు మార్చే ఉద్దేశంతో ఆ నేత ఫోన్ చేసి ఆరా తీశారా?.. లేక ఎవరెవరు ఆశిస్తున్నారనే అంశాన్ని తెలుసుకోడానికి సంప్రదించారా?.. ఇలాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.

Tags:    

Similar News