తెలంగాణ కేబినెట్‌లో 6 ఖాళీలు.. కాంగ్రెస్ ముఖ్య నేతలకు హైకమాండ్ పిలుపు
తెలంగాణ కేబినెట్ విస్తరణ(Telangana Cabinet Expansion)పై కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ విస్తరణ(Telangana Cabinet Expansion)పై కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారని, ఆ మేరకు తమకు సంకేతాలు వచ్చాయని ఇటీవల అసెంబ్లీలో ఆశావహులు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలను నిజం చేసేలా తాజాగా.. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు పిలుపు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో భేటీ కాబోతున్నారు.
మరోవైపు.. ఈ ఢిల్లీ పర్యటనలోనే కేబినెట్ విస్తరణకు ముహూర్తం, జాబితా ఖరారు చేసుకుని వస్తారని తెలస్తోంది. విస్తరణ ఇప్పటికే ఆలస్యమైందని, సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు అధిష్టానం సైతం రెడీగా ఉన్నదని సమాచారం. అన్ని వర్గాలు, జిల్లాలు, హామీలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవుల పంపకం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బలుూ నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మంత్రి పదవి ఆశిస్తున్న జాబితాలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారు తమకే పదవి లభిస్తుందనే ధీమాలో ఉన్నారు. నిన్న మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామాకు కూడా వెనుకాడబోనని సంచలన ప్రకటన చేశారు. దీంతో పదవుల పంపకం కాంగ్రెస్ అధిష్టానికి పెద్ద టాస్క్‌గా మారింది.