తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు వడ్డీలేని రుణాలు అందించే పథకం ఇవాళ ప్రారంభించింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు వడ్డీలేని రుణాలు అందించే పథకం ఇవాళ ప్రారంభించింది. మంగళవారం సికింద్రబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 64 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు మహిళలకు ఈ వడ్డీలేని రుణాలు అందలేదని గుర్తుచేశారు.
ప్రతి నిర్ణయంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. ఇకపై ప్రతి ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్ చేయనుంది. ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. అలాంటి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుంటే కేసీఆర్ కుటుంబానికి కడుపు మండుతోందని మండిపడ్డారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించారని అన్నారు. అయినా తమ ప్రభుత్వం ఉచిత ప్రయాణాన్ని ఆపలేదని అన్నారు.