అసెంబ్లీ సమావేశాలకు రెడీ.. వాటిపైనే కాంగ్రెస్ గురి

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్​ పార్టీ అస్త్రాలు సిద్ధం చేస్తోంది. నాలుగేండ్ల నుంచి అధికార పార్టీ ఇచ్చిన హామీలు, నెలకొన్న సమస్యలు, నిధుల విడుదల వంటి అంశాలను ప్రధాన టార్గెట్​గా

Update: 2022-03-06 05:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్​ పార్టీ అస్త్రాలు సిద్ధం చేస్తోంది. నాలుగేండ్ల నుంచి అధికార పార్టీ ఇచ్చిన హామీలు, నెలకొన్న సమస్యలు, నిధుల విడుదల వంటి అంశాలను ప్రధాన టార్గెట్​గా చూపిస్తూ అసెంబ్లీలో ప్రశ్నించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హోటల్ తాజ్​లో ఆదివారం ఉదయం నుంచి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో టీపీసీసీ కార్యవర్గం, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముందే సీఎల్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫార్మాట్​ రూపంలో నియోజకవర్గాల నుంచి సమస్యల జాబితాను తీసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఎలాంటి హామీలిచ్చారు. ఆ సెగ్మెంట్లో నెలకొన్న సమస్యలన్నీ ప్రత్యేక ఫార్మాట్​ రూపంలో సేకరించారు. వీటన్నింటపైనా ప్రత్యేకమైన జాబితాను సిద్ధం చేశారు.

రోజుకో సమస్య

రేపట్నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్​ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ జరిగినన్ని రోజులు కాంగ్రెస్​ ఆధ్వర్యంలో సమస్యలపై నిలదీస్తూ ప్రశ్నించాలని, అసెంబ్లీ వేదికగా సీఎం నుంచి సమాధానం రాబట్టుకోవాలని ప్లాన్​ చేస్తోంది. ప్రతిపక్షాలకు సీఎం అపాయింట్​మెంట్​ ఇవ్వకపోవడం, అసలు ప్రజలు కూడా కలిసేందుకు అవకాశం లేకపోవపడంతో అసెంబ్లీ సమావేశాలనే వేదికగా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన సమస్యల జాబితాలో ఎక్కువుగా ఉన్న​వాటిని తీసుకుని వాటిని ప్రశ్నించాలని భావిస్తున్నారు. రోజుకో అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని, ప్రతి ఎమ్మెల్యేకు ఒక్కో అంశంపై మాట్లాడేందుకు బాధ్యతలిస్తున్నారు.

వరి నుంచి స్టార్ట్​

ఇప్పటి వరకు నియోజకవర్గాల వారీగా సేకరించిన సమస్యల జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లపైనే ఎక్కువ ఆందోళన ఉన్నట్లు సీఎల్పీ గుర్తించింది. యాసంగి ధాన్యం కొనమంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దీనిపై అసెంబ్లీలో సీఎం నుంచి సమాధానం రాబట్టాలని, రైతులకు భరోసా కల్పించాలనుకుంటున్నారు. యాసంగి ధాన్యం కొంటారా లేదా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారా అనే విషయాలపై తొలి రోజు నుంచే ప్రశ్నించనున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం ఉదయం నుంచి ఓ ప్రైవేట్ హోటల్​లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎల్పీ ఆధ్వర్యంలో ఈ సమావేశం సాగుతోంది. శనివారం సాయంత్రం వరకు ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాత్రి హైదరాబాద్​కు వచ్చారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం టీపీసీసీ చీఫ్​తో భేటీ అయిన అనంతరం అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు.

Tags:    

Similar News