Tweet War : దిక్కుమాలిన ప్రాజెక్టు ఒకటి కట్టిల్లు.. ‘కాళేశ్వరం’పై కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్వీట్ వార్!
తెలంగాణలో వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతుంది. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ట్వీట్ వార్ నడిచింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతుంది. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ట్వీట్ వార్ నడిచింది. కాంగ్రెస్ కుట్రలను తట్టుకుని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ అని వీడియోలు ట్విట్టర్ వేదికగా పంచుకుంటుంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కౌంటర్ ట్వీట్ వేసింది.
సిగ్గు లేకుండా గొప్పగా చాటి చెప్పుతున్నారు
‘నాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిధులన్నీ దొర గారి ఫామ్ హౌస్ కు తరలిపోయాయి కాబట్టే.. నేడు గోదావరి నీళ్లన్ని సముద్రానికి తరలిపోతున్నాయి. కేసీఆర్ అండ్ కో కాసులకు కక్కుర్తి పడి, అంచనాలను పెంచి, అడ్డదిడ్డంగా కట్టిన ప్రాజెక్టు నేడు దేనికి పనికి రాకుండా పోతుంది. నీళ్లాగితే ప్రాజెక్టు కుప్పకూలుతుంది కాబట్టే, వచ్చిన నీళ్లన్నీ వచ్చినట్టే కిందికి పోతుంటే.. అది కూడా సిగ్గు లేకుండా గొప్పగా చాటి చెప్పుతున్నారు. ప్రజా ధనం వృధా చేసిన.. మీకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. వరద నీరు వస్తే మునిగిపోయి, కూలిపోయే పేకమేడ లాంటి దిక్కుమాలిన ప్రాజెక్టు ఒకటి కట్టిల్లు. ఇప్పుడు వర్షాలు పడి గోదావరి నది ప్రవహిస్తూ.. తెలంగాణలో సాగునీటి కోసం, తాగునీటి కోసం నిల్వ చేయవలసిన నీళ్లన్నీ సముద్రం పాలు అవుతుంటే సన్నాసులు సంకలు గుద్దుకుంటున్నారు. 80 వేల పుస్తకాలు చదివిన మహా మేధావి, తమకు తామే కాళేశ్వరరావుగా నామకరణం చేసుకొని, రివర్స్ ఇంజనీరింగ్ పేరుతో ప్రాజెక్టు మొత్తం ఉల్టా పల్టా చేసిండు. రిజర్వాయర్లు కట్టేది నీటి నిల్వ కోసమని, సముద్రంలోకి వదలడం కోసం కాదనే ఇంగిత జ్ఞానం లేని సన్నాసులు ఇన్నేళ్లు పాలించడం వల్లే తెలంగాణ అప్పుల పాలైంది. కానీ దొరగారు, దొరగారి కుటుంబం, దొరగారు పెట్టిన పార్టీ మాత్రం అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది’ అని ట్వీట్‌లో తీవ్ర విమర్శలు చేసింది.
Read More..