శృతిమించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్విట్టర్ వార్! మధ్యలో బీజేపీ నీతులు!
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అధికారిక ట్విట్టర్ హ్యండిల్స్ పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అధికారిక ట్విట్టర్ హ్యండిల్స్ పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నేతల వైఫల్యాలు, అవినీతి ఎత్తి చూపుతూ ఈ అధికార హ్యాండిల్స్ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలుపుతాయి. మరోవైపు పార్టీలో జరిగే విషయాలు, ప్రెస్‌మీట్లు, నేతల కీలక మాటలు ప్రజలకు పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాయి. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలు ఎక్కువైనాయి. ఈ క్రమంలోనే విమర్శలు కాస్త శృతి మించి పోయాయి. ఏకంగా పార్టీలో ఉండే కీలక నేతల ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కారు చౌక గ్యాంగ్ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ తిరిగి కౌంటర్ ట్వీట్ వేసింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, దివంగత నేత రాజీవ్ గాంధీ ఫోటోలు మార్ఫ్ చేసి బార్ డ్యాన్సర్ పార్టీ అని తీవ్రంగా విమర్శించింది. దీంతో ఇరు పార్టీల అభిమానులు ఈ అధికార వ్యాండిల్స్‌పై ఫైర్ అవుతున్నారు. నెటిజన్లు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నేతల తప్పులను బయట పెట్టాలని కానీ, ఇంత నీచంగా మార్ఫింగ్స్ చేయడం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరోవైపు బీజేపీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ వీరి ట్వీట్లను జత చేసి ఇద్దరి పార్టీలకి నీతులు చెప్పింది. ‘అస్తిత్వ, అధికార దాహంతో రోజు రోజుకీ దిగజారుతున్న కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీలు’ బీజేపీ తాజాగా ట్వీట్ చేసింది.