కాంగ్రెస్, బీఆర్ఎస్ హైఓల్టేజ్ ‘హైడ్రా’మా ఆడుతున్నాయి: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్

హైడ్రా పేరిట కాంగ్రెస్, బీఆర్ఎస్ హైఓల్టేజ్ హైడ్రామాను ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ మండిపడ్డారు.

Update: 2024-09-12 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా పేరిట కాంగ్రెస్, బీఆర్ఎస్ హైఓల్టేజ్ హైడ్రామాను ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఏదైనా సమస్య రాగానే ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరో సమస్యను తెరపైకి తీసుకువచ్చారని, ఈ పదేళ్లలో అది చూశామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్, బీఆర్ఎస్ అడుగుజాడల్లో నడుస్తూ డ్రామాలు కొనసాగిస్తోందని ఫైరయ్యారు. తరచూ ఒక కొత్త నాటకానికి తెరలేపి, జనాన్ని మెప్పించాలని విఫలయత్నం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడ అని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను నెరవేర్చకుండా రోజుకో కొత్త డ్రామా, రోజుకో కొత్త వేషాన్ని తెరపైకి తీసుకురావడం కాంగ్రెస్-బీఆర్ఎస్ బంధాన్ని మరోసారి నిరూపిస్తోందన్నారు. హామీల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడం కోసమే ప్రజలు అధికారం కట్టబెట్టారా? అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రయోజ‌నాల గురించి కొంచెం కూడా ఆలోచన లేదా అని ఫైరయ్యారు. ప్రజల ఓట్లతో గెలిచి, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు హద్దులు దాటి, కుసంస్కారంగా విమర్శలు చేసుకోవడం సమాజానికి అవమానమని ఫైరయ్యారు. ఇలాంటి వారిని ఎన్నుకున్నందుకు ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాజకీయాల్లో ప్రతిసారి నాటకాలకు ఓట్లు పడుతాయనుకోవడం, ప్రజలు నమ్ముతారనుకోవడం భ్రమేనని సుభాష్ పేర్కొన్నారు. అధికార పార్టీ ప్రజాసమస్యలను సామరస్యంగా పరిష్కరించడంపై, అభివృద్ధి పథకాలపై దృష్టి పెట్టి ప్రజల మెప్పు పొందాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా మద్దతుతో పోరాడాలని, సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలే తప్పితే ఇలాంటి సంస్కృతి సరికాదని సుభాష్ హెచ్చరించారు.


Similar News