కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేయాలి.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ,డైనమిక్ బ్యూరో:ఎన్నికల వరకే రాజకీయాలు అని ఇప్పుడు దేశ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీలో ఓ ఆర్డినరీ కార్యకర్తనైన తనను కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా ఇలా ఎన్నో బాధ్యతలలో నిలబెట్టిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియా సంస్థతో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కరీంనగర్, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి వస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. రాజకీయాల కోసం విమర్శలు, ప్రతివిమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించకపోవడం వల్లే అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదని అలాంటి తప్పిదాలు ఈసారి జరగకూడదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ, ఏపీలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అభివృద్ధి కోసం ఈ రెండు రాష్ట్రాల్లోని పార్టీలు కలిసి పని చేస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన బండి సంజయ్.. తనకు ఏ శాఖను అప్పగించినా విమర్శలకు తావివ్వకుండా పని చేస్తానన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తుందన్నారు.