సీఎం కీలక ప్రకటన.. ఎమ్మెల్యేలకు భయం.. భయం

‘ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని.. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. పెండింగ్ పనులన్నింటినీ వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి..

Update: 2023-05-18 02:58 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ‘ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని.. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. పెండింగ్ పనులన్నింటినీ వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి.. అలా చేయలేని వారికి టికెట్లు ఇవ్వం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువులు ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. వచ్చే ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్,‌ తదితరులకు దిశానిర్దేశం చేశారు.. సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇస్తామని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పినప్పటికీ.. పార్టీ పరిస్థితులు ఏఏ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు గెలుస్తారా.. వారు గెలవకపోతే ప్రత్యామ్నయం ఎవరు అనే అంశాలపై అధిష్టానం పూర్తిస్థాయి నివేదికలను సేకరించి సిద్ధంగా ఉంచినట్లు తేలడం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలను ఆందోళనలకు గురిచేస్తుంది.

నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి అయోమయం..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాల కు సంబంధించిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇస్తే గెలిచే పరిస్థితులు లేవు అన్న సమాచారం అధిష్టానానికి ఎప్పుడో చేరింది.. పలుమార్లు ఈ అంశానికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చలు కూడా జరిగాయి.

వారి పనితీరు మెరుగు పడుతుందా?

ఉమ్మడి జిల్లాలో పనితీరు అందంగా అంతంత మాత్రంగానే ఉండి.. వచ్చే ఎన్నికలలో గెలిచే పరిస్థితులు లేవన్న విషయం ఆయ నియోజకవర్గాలలోనే కాదు.. అధిష్టానానికి కూడా స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం వల్ల పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం కేసీఆర్ సూచించడం.. ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కొద్ది సమయంలో ప్రజలకు చేరువై... ఇచ్చిన హామీలను అమలు చేసిన ఇప్పటికే నాటుకుపోయిన వ్యతిరేకత‌ను ఎలా అధిగమిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ నిర్దేశించిన సమయానికి ఎమ్మెల్యేల పనితీరు, వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశాలపై మరికొన్ని సర్వేలు జరగనున్నాయి.

మెరుగు పడకుంటే అభ్యర్థుల మార్పు తప్పదు..

ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పడుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దనే నిర్ణయంలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీలు గతంలో కన్నా బాగా పుంచుకోవడం, ఎన్నికలలో గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు ఉన్న కారణంగా ప్రతి సీటును గెలుచుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అవసరమైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నచోట వారి స్థానంలో ఇతరులకు అవకాశాలు ఇచ్చి అన్ని స్థానాలను గెలుచుకునేలా పార్టీ అధిష్టానం ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News