భారత రాష్ట్రపతి వద్దకు చేరిన TSPSC పేపర్ లీకేజీ ఇష్యూ

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చిన్న ఉద్యోగుల నుంచి ప్రారంభమైన విచారణ కమిషన్‌లోని పెద్దల వరకు వెళ్లింది.

Update: 2023-04-03 06:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చిన్న ఉద్యోగుల నుంచి ప్రారంభమైన విచారణ కమిషన్‌లోని పెద్దల వరకు వెళ్లింది. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలసిందే. తాజాగా ఈ వ్యవహారం భారత రాష్ట్రపతి వరకు చేరింది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారంపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ పాత్రను బహిర్గతం చేయడం కోసం సీబీఐ విచారణ చేయాలని ఆయన లేఖలో కోరారు.

అంతేకాకుండా, ప్రస్తుత కమిషన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా అందరూ భారత రాష్ట్రపతికి లేఖలు రాయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, మరో ట్వీట్లో నమస్తే తెలంగాణ బీఆర్ఎస్‌కు భజన చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తొమ్మిదేండ్లలో 60వేల ఉద్యోగాలు భర్తీ చేపట్టిందని వచ్చిన ఓ వార్తా కథనాన్ని షేర్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓవైపు, టీఎస్‌పీఎస్సీపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు గగ్గోలు పెడుతుంటే, నమస్తే తెలంగాణ మాత్రం బీఆర్ఎస్‌కు భజన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయడం బీఆర్ఎస్‌కు చేతకాదని తేలిపోయిందని...బీఎస్పీ అధికారంలోకి రాగానే 10 లక్షల ఉద్యోగాలు సృష్టించి, పారదర్శకంగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News