12 మందిపై కంప్లైంట్.. ఆ రెండు పార్టీలే టార్గెట్‌గా కాంగ్రెస్ భారీ ప్లాన్!

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ నిన్న మొయినాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-01-07 04:12 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ నిన్న మొయినాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంపై డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్లకు ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మొయినాబాద్‌లో రోహిత్ రెడ్డి తమకు బీజేపీ ఎర వేసేందుకు చూసిందని కేసు వేయగా స్వీకరించిన పోలీసులు మరి ఏ లబ్ధి పొంది కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరారని హస్తం నేతలు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి పలు సాక్ష్యాలను ఫిర్యాదు‌కు జత చేశారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడే తెరపైకి తెవడం వెనుక కాంగ్రెస్ భారీ ప్లాన్ ఉందని టాక్.

ఇటీవల తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వాళ్లు మళ్లీ బీఆర్ఎస్‌లో చేరతారని బీజేపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఇందుకు బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉదాహరణగా చూపుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్లేనని బలంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ సత్ఫలితాలు సాధిస్తోంది. అయితే ఓ పక్క కేసీఆర్ తమ పార్టీని వీక్ చేస్తే మరో పక్క బీజేపీ కాంగ్రెస్‌పై ఫిరాయింపుల ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందుతోంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

ఆ రెండు పార్టీలను నిలువరించేందుకే..

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని నిలువరించాలంటే ఈ అంశం కీలకంగా మారనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ మొత్తం వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన అంశాన్ని వాడుకోవడంతో పాటు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి ఎలాగైనా రాష్ట్రంలో సత్తా చాటాలనే నిర్ణయానికి వచ్చింది. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌కు అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్, పట్టు ఉంది. పార్టీలో గుర్తింపు పొందిన నాయకులే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఉన్నారు. అయినా పొలిటికల్ గేమ్‌లో కేవలం అంతర్గత కుమ్ములాటలతోనే హస్తం పార్టీ వెనకబడింది.

కాగా ఇవే అంశాలపై ఫోకస్ చేసి రానున్న ఎన్నికల్లో విజయ తీరాలకు చేరాలని హస్తం పార్టీ యోచిస్తోంది. సమిష్టిగా ఉంటేనే ఫలితాలు సాధించవచ్చని మెజార్టీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్ గతంలో ఫిరాయింపులకు పాల్పడిన విషయాన్ని ప్రజల ముందు ఉంచేందుకు కాంగ్రెస్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు సబబు కానట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎలా సమర్ధించుకుంటారని కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేందుకు స్కెచ్ వేశాయి.

ఈ అంశాలతోనే ముందుకా..

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా రాజస్థాన్ మాదిరిగా సిలిండర్ ధరను రూ.500 కే అందించడం, హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలపై అధ్యయనం చేసి ఎన్నికల మేనిఫెస్టో తయారీ నాటికి సంచలన అంశాలను అందులో చేర్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున వీటితో పాటు కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించిన వారిని టార్గెట్ చేయడం ద్వారా ఎన్నికల్లో ప్రజల్లోకి బలమైన సందేశాన్ని పంపేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.

కాంగ్రెస్ ఫిరాయింపులను ఉపేక్షించదని పార్టీ మారితే చర్యలు తప్పవనే మెసేజ్ పంపేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమించింది. పలు కీలక శాఖల్లో అవినీతిపై కూడా సీబీఐకి కాంగ్రెస్ ఫిర్యాదు ఇవ్వనున్నట్లు తెలిసింది. మరి ఈ 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు అంశం హస్తం పార్టీకి కలిసొస్తుందో లేదో చూడాలి.     



Tags:    

Similar News