కాలేజీలో వేధింపులు నిజమే.. సాత్విక్ ఘటనలో ప్రభుత్వానికి కమిటీ నివేదిక!
శ్రీచైతన్య కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధి సాత్విక్‌పై వేధింపులు నిజమేనని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీచైతన్య కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధి సాత్విక్‌పై వేధింపులు నిజమేనని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించింది. శ్రీ చైతన్య కాలేజీపై విచారణ జరిపిన కమిటీ కీలక విషయాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేసింది. నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ నేతృత్వంలో కమిటీ 5 రోజులపాటు విచారణ నిర్వహించింది. విచారణలో భాగంగా శ్రీచైతన్య కాలేజీకి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించింది.
శ్రీచైతన్య కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని కమిటీ తేల్చి చెప్పింది. వేరే కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ ఉన్నట్లు గుర్తించింది. అడ్మిషన్ వేరే కాలేజీలో ఉన్నా కూడా నార్సింగి కాలేజీలో సాత్విక్ చదువుతున్న విషయాన్ని నివేదికలో కమిటీ ప్రస్తావించింది. రాష్ట్రంలోని అన్ని కార్పోరేట్ కాలేజీల్లో ఇదే రకమైన పరిస్థితి ఉందని అభిప్రాయపడింది. కాలేజీలో క్లాసులు నిర్వహిస్తున్నా...విద్యార్ధులకు సర్టిఫికెట్లను చిన్న కాలేజీల పేరుతో జారీ చేస్తున్నారని కమిటీ గుర్తించింది. విద్యార్ధుల అడ్మిషన్లపై చెక్ చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది.