నాడు పెద్దపల్లిలో.. నేడు ఖమ్మంలో కలెక్టర్ మార్క్..!

ముజామ్మిల్ ఖాన్..యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారి.

Update: 2024-06-23 05:18 GMT

దిశ బ్యూరో, ఖమ్మం: జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే పాలనలో ప్రత్యేకతను చూపిస్తున్నారు. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ అధికారుల్లో జవాబుదారీతనం పెంచుతున్నారు. సమయానికి కార్యాలయానికి వస్తూ అక్కడ పనిచేస్తున్న సిబ్బందినీ అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్లినా, అంగన్ వాడీ కేంద్రాలకు వెళ్లినా కిందకూర్చునే అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటున్నారు. అక్కడివారితో మమేకమై భరోసా కల్పిస్తున్నారు. అధికారిగా చేయాల్సిన పనులను తప్పకుండా చేస్తానని నమ్మకం కల్పిస్తున్నారు. వారం రోజుల్లోనే ప్రభుత్వాస్పత్రిని, అంగన్ వాడీ కేంద్రాన్ని, ఎరువులు, పురుగుల మందు దుకాణాలను తనిఖీ చేసి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వారిచ్చిన సలహాలు, సూచనలు స్వీకరిస్తూనే అధికారులుగా తామేం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు.

ఉరుకులు, పరుగులతో తనిఖీలు

నాలుగురోజుల కిందట ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రిని సందర్శించి, అక్కడ ప్రసూతి, శస్త్రచికిత్స, జనరల్ వార్డులతో సహా వివిధ వార్డుల్లో కలియదిరిగారు. రోగుల వద్దకు వెళ్లి కింద కూర్చుని వైద్యసేవలకు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. తర్వాత ఇందిరానగర్ లోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీచేసి హాజరుపట్టికలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి, విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.

మిగతా అన్ని శాఖల అధికారులతో మరో సమీక్ష నిర్వహించారు. చింతకాని తహశీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసి ధరణి పెండింగ్ దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ స్లాట్ల గురించి తెలుసుకున్నారు. అక్కడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. చింతకానిలోని అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి పిల్లల హాజరుశాతం, మెనూ వివరాలు అడిగి తెలుసుకుని చిన్నారులతో సరదాగా గడిపారు. విత్తన విక్రయ షాపులను తనిఖీ చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు సంబంధించి రైతులకు బిల్లులు ఇవ్వాలని పారదర్శకంగా రిజిస్టర్ల నిర్వహణ చేపట్టాలని సూచించారు.

కలెక్టరేట్‌కు వెళ్లినా.. తనిఖీలకు వెళ్లినా

జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ భిన్నమైన పనితీరును ప్రదర్శిస్తున్నారు. కలెక్టరేట్ కు వెళ్లినా, ఇతర కార్యాలయాల్లో తనిఖీలకు వెళ్లినా ఉన్నతాధికారిననే గర్వాన్ని ఏ మాత్రం ప్రదర్శించడం లేదు. అక్కడున్నటువంటి సదుపాయాలతోనే అడ్జస్ట్ అవుతూ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపిస్తున్నారు. కింద కూర్చోనే అక్కడివారితో మాట్లాడి ధైర్యం నింపుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కూడా ఇదే పద్ధతిని అవలంభించి అక్కడి ప్రజల్లో ఒకరిగా మారిపోయారు. విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి సారించి అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. కలెక్టరేట్ లో సైతం సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రతీ ఒక్కరినీ కలుస్తూ ఓర్పుగా సమాధానం చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో తన మార్కు పాలనగా అడుగులు వేస్తున్నారు.

వీటిపై మరింత దృష్టి అవసరం..

జిల్లాలో ప్రధానంగా పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలపై కలెక్టర్ మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అనేక రకాలైన భూ సమస్యలు కూడా కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములకు కాపాల్సిన బాధ్యత కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో భూములకు సంబంధించి అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్ పైనే ఉంది. ఇవే కాకుండా వివిధ శాఖల్లో అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. వారిపై కూడా దృష్టిపెట్టి పాలనను గాడిలో పెట్టాలి. కొత్త ప్రభుత్వం, జిల్లాకు కొత్త పాలనాధికారిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న వాస్తవాన్ని గమనించాలి.

హైదరాబాద్‌లో పుట్టిపెరిగి..

ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. పదవ తరగతి వరకు 12 స్కూళ్లలో చదివిన ముజామ్మిల్ 8 నుంచి 10వ తరగతి వరకు మాత్రం నలంద విద్యాలయంలో చదివారు. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మొదట గూగుల్ లో జాబ్, తర్వాత ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం చేస్తూ మూడవ ప్రయత్నంలో 2017లో ఐఏఎస్ సాధించారు. తండ్రి ఏకే ఖాన్, ఐపీఎస్ ఆఫీసర్. తెలంగాణ ఏసీబీ డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి సమీరా లా చదివి ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. తాత అబ్దుల్ ఖరీంఖాన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. తాత, తండ్రిని ఆదర్శంగా తీసుకుని సివిల్స్ సాధించిన ముజామ్మిల్ ఖాన్ అకాడమీ శిక్షణలో ఉన్నప్పుడు పరిచయం అయిన కేరళావాసిని వివాహం చేసుకున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రభుత్వం సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)పోస్టింగ్ ఇచ్చింది. మూడు సంవత్సరాల 9నెలల పాటు పనిచేశారు. తొలిసారిగా పెద్దపల్లి కలెక్టర్ గా ఇప్పుడు ఖమ్మం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.


Similar News