స్కూలింగ్‌లోనే ‘కోడింగ్’.. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు
సాంకేతిక, పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు లేనిదే విద్యార్థులు ఏ రంగంలోనూ రాణించలేరు.
దిశ, తెలంగాణ బ్యూరో: సాంకేతిక, పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు లేనిదే విద్యార్థులు ఏ రంగంలోనూ రాణించలేరు. ఈ ఇంటర్నెట్ యుగంలో విద్యార్థులను నైపుణ్యాలు కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల దశ నుంచే సాంకేతికతపై అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ముందడుగు వేసింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు కోడింగ్ పై ప్రత్యేక శిక్షణను ఇచ్చేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందించింది. నేటి విద్యార్థులను రేపటి టెకీలుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు ప్రయత్నాలను చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులకు దశలవారీగా కోడింగ్ పై శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకు టీ-హబ్ వేదికగా వినియోగించుకోనున్నట్టు వారు వెల్లడించారు.
6వ తరగతి నుంచే..
కోడింగ్ శిక్షణకు ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. సాంకేతికపై కనీస అవగాహన ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు జోన్ల వారీగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకులాలను 7 జోన్లుగా విభజించగా.. ఒక్కో జోన్ లోని విద్యార్థులకు మూడు రోజుల చొప్పున 21 రోజుల్లో ట్రైనింగ్ పూర్తి చేస్తారు. ఒక జోన్ లోని విద్యార్థులకు శిక్షణ పూర్తయ్యాకే మరో జోన్ లోని విద్యార్థులకు శిక్షణను ప్రారంభిస్తారు.
ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురు..
రాష్ట్ర వ్యాప్తంగా 238 ఎస్సీ గురుకులాలు ఉన్నాయి. ప్రాథమికంగా ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేస్తుండగా మొత్తంగా 1,190 మందికి కోడింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ పొందిన ఈ విద్యార్థులు.. ఒక్కొక్కరు 75 మంది చొప్పున శిక్షణ ఇస్తారు. ఈ లెక్కన 1,190 మంది విద్యార్థులు అన్ని ఎస్సీ గురుకులాల్లోని 89,250 మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణను రూపొందించారు. ప్రాథమికంగా ఎంపిక చేసిన ఐదుగురు విద్యార్థులకు మూడు లేదా ఆరు నెలల కోసారి కోడింగ్ పై శిక్షణ ఇస్తూనే ఉంటారు.
శిక్షణ కోసం పాఠశాలలో ఏర్పాట్లు..
టీ-హబ్ లో శిక్షణ పొందిన విద్యార్థులు తమ పాఠశాలలోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కావాల్సిన వసతులను ఎస్సీ గురుకులాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రొజె క్టర్లు, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. లేని చోట ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. కోడింగ్ శిక్షణకు మౌలిక సదుపాయాల కల్పనలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను సమకూర్చడంతోపాటు నిర్మాణ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇవే కాకుండా ఇతర స్వచ్ఛంధ సంస్థల సహకారాన్ని తీసుకోనున్నట్టు తెలిపారు.