అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు షాక్.. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు సోమవారం సభ ప్రారంభం అయింది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాల్లో భాగంగా రెండో రోజు సోమవారం సభ ప్రారంభం అయింది. కాగా ఈ సభలో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీ పేరిట ప్రభుత్వం నిర్బంధ భూసేకరణను ప్రతిఘటించిన అమాయక లగచర్ల రైతులను బంధించి, వారిని జైల్లో బంధించిన అంశంపై చర్చించేందుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం(Adjournment Resolution) ఇచ్చింది. ఈ తీర్మానాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రవేశ పెట్టగా.. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కాలేరు వెంకటేశ్వర్లు, కొత్త ప్రభాకర్ రెడ్డి, విజేయుడు, మర్రి రాజశేఖర్ రెడ్డీలు సంతకం చేసి వాయిదా తీర్మానాన్ని అందించారు. కాగా బీఆర్ఎస్ పార్టీ లగచర్ల ఘటనపై చర్చించేందుకు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కాగా అంతకు ముందు పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్క ఇచ్చిన వివరణకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.