ఉస్మానియా డి హాస్టల్ వద్ద నాగుపాము కలకలం!.. భయాందోళనలో విద్యార్ధులు
ఉస్మానియా యూనివర్సిటీలో మరో సారి నాగుపాము సంచరించడం కలకలం సృష్టించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలో మరో సారి నాగుపాము సంచరించడం కలకలం సృష్టించింది. యూనివర్సిటీలో పాములు సంచరిస్తున్నాయని వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆర్ట్స్ కాలేజీ వెనుక ఉన్న ఎస్ బీఐ బ్యాంక్ వద్ద పాము సంచరించడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అది మరిచేలోపే సి హాస్టల్ వద్ద మరో పాము సంచరిస్తున్నట్లుగా వీడియోలు బయటపడ్డాయి. ఇప్పుడు మరో సారి డి హాస్టల్ వద్ద నాగుపాము డ్రైనేజీ పైపుకు చుట్టుకొని ఉండటం కలకలం రేపింది.
ఈ నాగుపాము ఆరడుగుల పొడవుతో పడగ విప్పి ఉండటంతో హస్టల్ విద్యార్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనిపై వెంటనే స్నేక్ స్నాచర్ కు ఫోన్ చేయడంతో అతడు వచ్చి పామును పట్టుకొని జనారన్యం లేని వదిలి వెళ్లినట్లు విద్యార్ధులు తెలిపారు. ఈ వరుస ఘటనలపై విద్యార్ధులు హాస్టల్ నుండి బయటకి రావాలంటే భయపడుతున్నామని, దీనిపై గతంలోనే ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. విద్యార్ధులు ప్రాణభయంతో హాస్టల్ నుంచి బయటకి రావాల్సి వస్తుందని, దయచేసి పాములు రాకుండా యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్ధులు కోరుకుంటున్నారు.