CM KCRపై పోటీకి ఈటల సై.. బీజేపీ ఆ డిమాండ్‌కు ఓకే అంటుందా?
గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై పోటీకి బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పోటీకి సై అంటున్నారా..?
దిశ, సిద్దిపేట ప్రతినిధి : గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై పోటీకి బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పోటీకి సై అంటున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించడంతో ఈ విషయం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌కు ధీటైన అభ్యర్థి ఈటలే..? గజ్వేల్ బరిలో ఆయన ఉంటే జిల్లాలో కమలం పార్టీకి బూస్ట్ అవుతుంది..? అంటూ ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.
రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్ హై ప్రొఫైల్ నియోజకవర్గం. ఇక్కడి నుంచే సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. ముచ్చటగా మూడో సారి గజ్వేల్‌లో పోటీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే గజ్వేల్ బరిలో ఈటల రాజేందర్ నిలుస్తారా..? నిలువరా..? అనే సందిగ్ధత కు ఈటల రాజేందర్ స్వయంగా తెరదించారు. ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గంలో కార్యకర్తల జరిగిన కార్యకర్తల సమావేశంలో గజ్వేల్ సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తా అంటూ ప్రకటించడం గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది.
ముదిరాజ్ ఓటర్లు ఎటువైపో..?
గజ్వేల్ నియోజక వర్గంలో మొత్తం 2,65,636 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సుమారు 55వేల పై చిలుకు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గం వారివే. సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో ఆ వర్గం ప్రజలు ఎటువైపు నిలుస్తారో అనే చర్చ జోరుగా సాగుతుంది.
బీజేపీ టికెట్ కోసం 17 ఆశావహులు
గజ్వేల్ నియోజక వర్గంలో కమలం గుర్తుపై బరిలో నిలిచేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో స్థానిక నేతలతో పాటుగా, మరో ముగ్గురు స్థానికేతరులు టికెట్ కోసం అప్లై చేశారు. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం అనుమతిస్తుందా..? లేదా..? లేక అధిష్టానం నిర్ణయమే ఈటల రాజేందర్ ప్రకటించారా..? తెలియాలంటే బీజేపీ అధిష్టానం అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు వేచిచూడాల్సిందే.