నేడు మేడిగడ్డకు CM రేవంత్ రెడ్డి బృందం.. నల్లగొండలో కేసీఆర్ సభ టైమ్‌లోనే..!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సందర్శించనున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సందర్శించనున్నది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచే ప్రత్యేక బస్సుల్లో వారిని తీసుకెళ్ళేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున నేరుగా అక్కడి నుంచే మంగళవారం ఉదయం 10 గంటల తర్వాత రోడ్డు మార్గంలో వెళ్ళేలా షెడ్యూలు ఖరారైంది. నల్లగొండలో సభ ఉన్న కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్నారు. బీజేపీ, మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం వేర్వేరు కారణాలతో ఈ టూర్‌కు దూరంగా ఉంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే మేడిగడ్డ టూర్‌కు ప్లాన్ చేయడంతో గత ప్రభుత్వంలో నిర్మాణమైన బ్యారేజీ తక్కువ కాలంలోనే ఎందుకు డ్యామేజ్ అయింది.. దీనికి కారకులెవరు.. బాధ్యత తీసుకునేదెవరు.. చర్యలు తీసుకోవాల్సింది ఎవరిపై.. ఇలాంటి అనేక సందేహాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ క్షేత్రస్థాయిలోనే బ్యారేజీకి సంబంధించిన అంశాలను అధికారుల ద్వారా వివరించి వాస్తవ పరిస్థితులను, తాజా స్థితిగతులను వివరించాలని ప్రభుత్వం ఈ టూర్‌ను ఏర్పాటు చేసింది. విజిలెన్స్ నివేదికతో పాటు గతంలో ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) జరిగిన అధ్యయనంలో తేలిన అంశాలు, నివేదికలో అది పొందుపరిచిన అబ్జర్వేషన్లు.. తదితరాలన్నింటిపై ప్రజా ప్రతినిధుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలనుకుంటున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగ వీరందరినీ తీసుకెళ్తున్నందున ఆ బ్యారేజీ డ్యామేజీ వెనక కారణాలను అధికారుల ద్వారానే వివరించేలా ప్లానింగ్ రూపొందింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ డ్యామేజీ గురించి ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓపెన్‌గా స్పందించలేదు. దీంతో ఈ టూర్‌కు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు దూరంగానే ఉంటున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గతంలో వచ్చిన ఖ్యాతి మొత్తం బ్యారేజీ డ్యామేజీతో గంగలో కలిసిపోయిందనే అభిప్రాయంతో ఉన్న బీఆర్ఎస్ నాయకులు దీనికి పోటీగా కృష్ణా జలాల అంశాలను తెరపైకి తెచ్చి నల్లగొండలో సభ పెట్టి ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లగొండ సభ కారణంగా రాలేమంటూ మెసేజ్ పంపితే వారు సూచించిన మరో తేదీన తీసుకెళ్ళడానికి తమకేమీ అభ్యంతరం లేదని అసెంబ్లీ వేదికగానే సీఎం రేవంత్ ఆఫర్ ఇచ్చారు. కానీ దీనిపై బీఆర్ఎస్ నేతల నుంచి స్పందన లేకపోవడంతో తొలుత రూపొందిన షెడ్యూలు ప్రకారం అన్ని పార్టీల నేతలనూ తీసుకెళ్ళేలా టూర్‌ను ఖరారు చేసింది. కానీ విపక్షాల ఎమ్మెల్యేలెవరూ లేకుండా అధికార పార్టీకి చెందినవారు మాత్రమే హాజరవుతున్నారు. సందర్శన అనంతరం సీఎం రేవంత్ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడనున్నారు. సరిగ్గా అదే సమయంలో నల్లగొండ బహిరంగసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రజలను ఉద్దేశించి కృష్ణా జలాలు, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో ప్రసంగించనున్నారు.
పోటాపోటీగా ఈ రెండు కార్యక్రమాలు జరుగుతుండడంతో అధికార, విపక్ష పార్టీల మధ్య వాటర్ వార్ సరికొత్త రూపం తీసుకుంటున్నది. లోక్‌సభ ఎన్నికలయ్యేంతవరకూ ఇది కంటిన్యూ అయ్యే అవకాశమున్నది. పరస్పరం విమర్శలు, ఆరోపణలతో వాస్తవం ఏ రూపంలో బైటకు వస్తుంది, ఏ వాదనను ప్రజలు ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మేడిగడ్డ టూర్ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో సైతం ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గం గుండానే రాత్రి పది గంటల కల్లా హైదరాబాద్ చేరుకోనున్నారు. మరుసటి రోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే విధంగా వీరి టూర్ షెడ్యూలు ఫిక్స్ అయింది.