RS ప్రవీణ్ కుమార్‌పై సీఎం రేవంత్ సీరియస్ కామెంట్స్
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. శుక్రవారం షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూసిందని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గురుకులాల్లో కనీసం గదులు ఉన్నయా? అని ప్రశ్నించారు. ఏనాడైనా విద్యార్థులకు కడుపునిండా తిండి పెట్టారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల పాఠశాలలు మూసి వేసిందని గుర్తుచేశారు.
ఇదంతా ఆ పార్టీలో కొనసాగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar)కు ఎందుకు కనిపించడం లేదని అడిగారు. బీఆర్ఎస్‌లో చేరగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మారిపోయాడా? అని అన్నారు. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం ఇవ్వాలనే సోయి లేని కేసీఆర్ వెంట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా నడుస్తున్నాడని సీరియస్ అయ్యారు. పేదలు తమ జీవితకాలమంతా కులవృత్తులు చేసుకుంటూ ఉండాల్సిందేనని కేసీఆర్ భావించారు. గొర్రెలు, బర్రెలు కొనివ్వాలని చూశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, ఇది అందరి ప్రభుత్వమని తెలిపారు.