CM Revanth: నేడు హస్తినకు సీఎం రేవంత్‌రెడ్డి.. అధిష్టాన పెద్దలతో ఆ విషయాలపై భేటీ!

అనుకున్నట్లుగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.

Update: 2024-08-22 04:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: అనుకున్నట్లుగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు వారిద్దరూ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణ, నామినేట్ పదవుల భర్తీ, కొత్త పీసీసీ చీఫ్ నియామక విషాలు భేటీలో చర్చకు రానున్నాయి. పర్యటనలో భాగంగా ముందుగా సీఎం, డిప్యూటీ సీఎం రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సమావేశమై సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.

కాంగ్రెస్ మైండ్ గేమ్..

ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక అడుగు ముందుకేసి తాము అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహాన్ని కూల్చివేస్తామని అన్నారు. అదేవిధంగా ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రెస్‌మీట్ పెట్టి మరి చెప్పారు. ఇక్కడే కాంగ్రెస్ మైండ్‌గేమ్‌ స్టార్ట్ చేసింది. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణను రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన చేయడంతో బీఆర్ఎస్‌ నేతలు డిఫెన్స్‌లో పడ్డారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం గట్టిగానే బదులిచ్చారు. పదేళ్లు పాటు అధికారాన్ని వెలగబెట్టిన మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం సత్య దూరమైన వ్యాఖ్యలతో కేటీఆర్ ప్రజల్లో విద్వేశాలను రగుల్చుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 

Tags:    

Similar News