CM Revanth: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును తెరమరుగు చేశారు: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకుందని.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును మాత్రం తెరమరుగు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Update: 2024-08-28 06:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకుందని.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును మాత్రం తెరమరుగు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్న చోట భూమి పూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని తెలిపారు. ఎట్టకేలకు 2014లో ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని అన్నారు. తెలంగాణ తల్లి కాకుండా రాష్ట్రానికి వారే సర్వం అన్నట్లుగా కేసీఆర్ కుటుంబం వ్యవహరించిందని ఆక్షేపించారు.

ప్రగతి భవన్ పేరుతో గడీని నిర్మించుకుని.. చుట్టూ కంచెతో పాటు వందలాది పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి పాలన సాగించారని దుయ్యబట్టారు. నేడు అదే ప్రగతి భవన్‌ను.. జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని గుర్తు చేశారు. నేడు ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా ప్రజాభవన్ వెళ్లి ఫిర్యాదు అందించే అవకాశం కల్పించామని అన్నారు. వాస్తవానికి భూమి పూజ ఘనంగా చేయాలనుకున్నామని.. కానీ, విజయదశమి వరకు మంచి రోజులు లేని మూలంగా ఇవాళే భూమి పూజ చేయాల్సి వచ్చిందని తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేలా పనులు కొనసాగుతాయని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. 


Similar News