అసెంబ్లీలో దానం బూతులు.. స్పందించిన సీఎం రేవంత్
అసెంబ్లీలో దానం బూతులు మాట్లాడటంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు...
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ బూతులు మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగా మైక్ ఇవ్వొద్దంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దుర్భాషలాడారు. అయితే దానం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ అభివృద్ధిపై దానం మాట్లాడుతుండగా అడ్డుపడటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా హైదరాబాద్‌లో దానం నాగేందర్ ప్రజా సేవలో ఉన్నారని, ప్రతి గల్లీ ఆయనకు తెలుసని చెప్పారు. ప్రజల సమస్యలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి దానం నాగేందర్ అని వ్యాఖ్యానించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా నగర ప్రజలకు చాలా సేవలు చేశారని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడేందుకు దానంకు స్పీకర్ అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. దానంకు మైక్ ఇవ్వొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు చచ్చిన పామును ఏం చంపుతాములే అని తాము ఊరుకున్నామని, గతంలో బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారో తమకు ఇంకా గుర్తుందన్నారు. ప్రతిపక్షాలకు మైక్ ఇస్తామని, కాని తాము మాట్లాడుతుండగా అడ్డుపడటం సరికాదని రేవంత్ రెడ్డి సూచించారు.
‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కనీస అవగాహన లేదు. అందుకే విచక్షణ కోల్పోతున్నారు. మైక్ ఎవ్వరికి ఇవ్వొద్దని ఎలా అడుగుతారు. మైక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలనడం ఎంత వరకూ సమంజసం. పోడియంలోకి వెళ్లి ఎందుకు అల్లరి చేస్తున్నారు. అరడజను మందిని రద్దు చేస్తే బుద్ది వస్తది. పోడియం వద్దకు ఎవరు రారు. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను ఎలా రద్దు చేశారో అందరికీ తెలుసు.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.