CM Revanth Reddy: ‘ఎవడుబడితే వాడు ఓ యూట్యూబ్ పెట్టుకుని వస్తున్నాడు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అసలు జర్నలిస్టుల కంటే కొసరు జర్నలిస్టులే ఎక్కువయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్టులు సమాజానికి సేవ చేసే డాక్టర్లు అని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ఎవడుపడితే వాడు సొంత యూట్యూబ్ పెట్టుకుని జర్నలిస్టులమని చెప్పుకుంటూ ఏదిబడితే అది మాట్లాడుతున్నారని, మరి కొందరు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.వారి వ్యవహారం నచ్చక ప్రజలు అడ్డు తిరిగితే మళ్లీ వారే జర్నలిస్టులపై దాడి అంటూ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పరంగా, ప్రజా ప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న ఈ విధానానికి ఎక్కడో ఓ చోటు పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఆ ఉద్దేశం మాకు లేదు:
నిజమైన జర్నలిస్టులలో ఒక్కరిని కూడా అగౌరవ పరచాలనే ఆలోచన కానీ వారికి అక్రిడేషన్ కార్డు, ఆరోగ్య భద్రత కార్డు, ఇంటి పట్టాల విషయంలో నష్టం చేసే ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్దాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత జర్నలిస్టులపైనే ఉందని దీనికి పరిష్కార మార్గాలు సూచించాలన్నారు. ప్రభుత్వం ఎవరిని జర్నలిస్టుగా గుర్తించాలి? జర్నలిస్టులు హద్దు దాటి వ్యవహహిస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అక్రిడేషన్ కార్డులు, భద్రతా కార్డుల జారీ, పత్రికల వర్గీకరణ, కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్, ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ అన్నింటిని క్రోడీకరించి కొత్త విధివిధానాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని వాటిపై ప్రభుత్వం చర్చించి కేబినెట్ ఆమోదంతో చట్టబద్దత కల్పించే బాధ్యత నేను తీసుకుంటాననన్నారు. గడిచిన పదేళ్లలో అనేక అంశాల్లో పాలసీలు లేవు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక్కోసమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు.
మీరు హద్దు దాటితే మేమెందుకు విలువలు పాటించాలి:
గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీకి జర్నలిస్టులను అనుమతించడంపై ఆంక్షలు ఉండేవన్నారు. నేను సీఎం అయ్యాక జర్నలిస్టులు అడగకముందే జర్నలిస్టులను అనుమతించాలని నేనే స్పీకర్ ను కోరారనని సీఎం చెప్పారు. సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకునేందుకు పార్టీలు పత్రికలు పెట్టుకున్నాయి. సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కొంత మందికి నచ్చకపోవచ్చు. అది మీ వ్యక్తిగతం. కానీ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గౌరవించాల్సిన బాధ్యత సదరు పత్రికలకు, ఆ పత్రికల యాజమాన్యం ముసుగులో ఉన్న రాజకీయ నాయకులకు ఉండదా? అని ప్రశ్నించారు. వాళ్లు ఆ గౌరవం, విలువలు పాటించనప్పుడు ప్రభుత్వ పరంగా మేమేందుకు పాటించాలన్నారు. బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి, అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే సహజంగానే రియాక్షన్ ఉంటుందని ఆ రియాక్షన్ ను జర్నలిస్టులందరూ ఆపాదించుకోవద్దన్నారు.
అసలు కంటే కొసరు జర్నలిస్టులే ఎక్కువయ్యారు:
చిట్ చాట్ లో ఆఫ్ ది రికార్డు వ్యాఖ్యలను కూడా రాద్ధాంతం చేస్తున్నారు. ప్రజల సమస్యలు వెలికితీసే జర్నలిస్టులు ఓ వర్గం అయితే కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి, ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్న జర్నలిస్టులు మరో కోవ అన్నారు. ఈ రెండింటిని విడదీయాలన్నారు. అనేక కార్యక్రమాల్లో గుర్తింపు కలిగిన జర్నలిస్టులకు స్థలం దొరకని పరిస్థితి ఏర్పడుతున్నది. అసలు జర్నలిస్టుల కంటే యూ ట్యూబ్ పేరుతో కొసరు జర్నలిస్టులు ఎక్కువైపోయారని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రభుత్వ కార్యాలయంలోకి మిమ్మల్ని అనుమతించడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సరైన గుర్తింపు కార్డు తీసుకుని రావాలన్నారు. సెక్రటేరియట్ కు ఎవరు రావాలి? ఎవరికి పాసులు ఇవ్వాలి? ఏ పత్రిక సర్క్యులేషన్ ను బట్టి ఎంత మందికి పాసులు ఇవ్వాలో విధివిధానాలు రూపొందించాలని మంత్రి పొంగులేటికి సూచిస్తున్నానన్నారు. ప్రెస్ అకాడమీకి స్పెషల్ ఫండ్ కిందా రూ.10 కోట్లు కేటాయిస్తామన్నారు. అర్హులైన మిగతా జర్నలిస్టులందరికీ ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తామన్నారు.