లండన్ వేదికగా మూసీ ప్రక్షాళనకు CM రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం

మూసీ నది ప్రక్షాళన పట్ల సీరియస్ దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కాలుష్యాన్ని నిర్మూలించడం, మరోవైపు టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దడం, ఇంకోవైపు ఆర్థిక

Update: 2024-01-19 12:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ నది ప్రక్షాళన పట్ల సీరియస్ దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కాలుష్యాన్ని నిర్మూలించడం, మరోవైపు టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దడం, ఇంకోవైపు ఆర్థిక పరిపుష్టిని కల్పించడంపై ఆలోచిస్తున్నది. దావోస్ పర్యటన ముగించుకుని లండన్ చేరిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి థేమ్స్ రివర్ అథారిటీ ప్రతినిధులతోనూ, లండన్ పోర్టు అధికారులతోనూ మూడున్నర గంటల పాటు చర్చలు జరిపారు.

ప్రస్తుతం థేమ్స్ నదిని పలు విధాలుగా అభివృద్ధి చేసినట్లే భవిష్యత్తులో హైదరాబాద్‌లోని మూసీ నదిని కూడా డెవలప్‌ చేయడంపై సహకారం అందించాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విజన్‌ను కూడా వారికి వివరించారు. త్వరలోనే లండన్ నుంచి నిపుణుల బృందం హైదరాబాద్ వచ్చి ప్రక్షాళనకు సంబంధించి ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు ప్లానింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వివరించనున్నది.

అనేక నగరాలను పరిశీలిస్తే నాగరికత నదుల ఒడ్డునే జరిగిందని, హైదరాబాద్ సైతం అందుకు అతీతం కాదని సీఎం రేవంత్ ఈ సమావేశంలో వివరించారు. బ్రిటిష్ కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, లండన్ పోర్టు అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివి తదితరులతో జరిగిన చర్చల్లో హైదరాబాద్ నగరానికి ఉన్న హుస్సేన్ సాగర్ ప్రతిష్టను, నగరాన్ని కష్టకాలంలో ఆదుకోడానికి ఉన్న ఉస్మాన్ సాగర్ లాంటి అంశాలను వారికి వివరించారు. థేమ్స్ నదిని ప్రక్షాళన చేసి సుందరంగా తీర్చిదిద్దడానికి పడిన శ్రమను, ప్రస్తుతం దాని నిర్వహణ తీరును సీఎం రేవంత్‌కు వారు వివరించారు.

ప్రకృతితో ఎదురయ్యే సవాళ్ళు, దానికి పరిష్కారంగా ఉండాల్సిన ఇంజనీరింగ్ డిజైన్, నిర్వహణలో భాగంగా అవసరమయ్యే ఆర్థిక వనరులు, దశాబ్దాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా కొనసాగించడానికి చేపట్టాల్సిన మేనేజ్‌మెంట్ యాక్టివిటీస్.. వీటన్నింటిపై సీఎంకు వీరు వివరించారు. లండన్ – విజన్ 2050 గురించి కూడా వారు అవగాహన కల్పించారు. మూసీ ప్రక్షాళనతో పాటు భవిష్యత్తులో అది పలు రూపాల్లో ఆదాయాన్ని ఇచ్చే మోడల్‌గా తీర్చదిద్దడంపైనా ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. 

Read More..

మూడున్నర రోజుల్లోనే రూ. 40,232 కోట్లు.. దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వర్షం  

Tags:    

Similar News