కోచింగ్ సెంటర్లు రూ. 100కోట్లు ఆశించడానికి మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు: CM రేవంత్ రెడ్డిపై RS ప్రవీణ్ కుమార్ ఫైర్

పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్ వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్రుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

Update: 2024-07-10 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్ వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్రుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. పరీక్షలు వాయిదా వేయడం వల్ల కోచింగ్ సెంటర్లకు రూ. 100 కోట్ల లాభం వస్తుందని.. కోచింగ్ సెంటర్ల నిర్వాహరకులు ఆశపడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాస్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఒక్కో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వంద కోట్లు సంపాదించడానికి వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ముఖ్యమంత్రి గారూ.. కావాలంటే మీ పంచన చేరిన రియాజ్‌ను అడగండి చెబుతాడు! ఇక నిరుద్యోగులను కిరాయి మనుషులనడం మీకే చెల్లు. ఆనాడు రాహుల్ గాంధీని అశోక్ నగర్‌కు తీసుకొచ్చినపుడు మీ వెంబడి వచ్చిన వాళ్లందరు కిరాయి మనుషులేనా? చెప్పండి నేను అడుగున్నా.

వచ్చిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలిచ్చిండ్రా? తమరికి ఉద్యోగాల నోటిఫికేషన్ కు, నియామకాలకు తేడా తెలవక పోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం. పక్కనున్న AP లో 1:50 నుండి 1:100 చేయగలిగినప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎందుకు చేయలేం? పరీక్షలను ఎందుకు వాయిదా వేయడం లేదు. ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్ కుమార్ సర్ ఒక్క రూపాయికే గ్రూప్ 2 అండ్ 3 కోచింగ్ అందిస్తున్నారు. అలాగే గ్రూప్స్ వాయిదా అనంతరం చాలా కోచింగ్ సెంటర్స్ రూపాయి ధరకే కోచింగ్ అందించినవి. పేద విద్యార్థులకు సాయం చేసినవి. మీకు దగ్గరున్న పక్క రాష్ట్ర కోచింగ్ సెంటర్ల లాగా లక్షలు కడితేనే టెస్టు సీరిస్ ఇస్తం అనే సంస్కృతి తెలంగాణ బిడ్డలకు లేదు.

అందుకే అశోక్ వెనక వేలాది మంది నిరుద్యోగులు ర్యాలీ అవుతున్నారు. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏందంటే.. మీకు నిరుద్యోగుల గోస అర్థం కావడం లేదు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా మీరు చెయ్యడం లేదు. మీ చుట్టూ ఉన్న సోకాల్డు మేధావులేమో పదవుల వేటలో ఉన్నారు. నిరుద్యోగులను వాడుకొని పదవుల్లో ఉన్నోళ్లకేమో పోటీ పరీక్షలు రాసిన అనుభవం లేదు. వచ్చిన పదవులను కాపాడుకనీకె వాళ్లు భౌన్సర్లను, బూతులను నమ్ముకున్నరు. ఇక అధికారులేమో తమరిని నిరంతరం ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీగా ఉన్నరు. వాళ్లకు పరిష్కారం తెలవక కాదు, కానీ మీకు పరిష్కారం ఇష్టం లేదు కాబట్టి వాళ్లు మీకు అసలు విషయం చెప్పడం లేదు.

కావాలంటే మీరు ఈ రోజు మీ తెలంగాణ CS కు చెప్పి చూడండి, సాయంత్రం కల్లా వాళ్లు మీకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తరు. మీకేమో ప్రతీదీ రాజకీయ కుట్ర లాగనే కనిపిస్తున్నది. నిరుద్యోగులకు సంఘీభావంగా మాట్లాడిన ప్రతి వ్యక్తిని తలకుమాసినోడని మీరంటున్నరు. మరి మీరు కూడా 2023లో ఇదే పని చేసిండ్రు కదా? మరి మిమ్మల్ని ఏమనాలి?ఆనాడు చిక్కడపల్లి కి వచ్చిన రాహుల్ గాంధీని ఏమనాలి? అసలు ప్రజాసమస్యల పై మాట్లాడే బాధ్యత ప్రతిపక్షాలకు లేదంటారా ?’’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. 

Tags:    

Similar News