CM Revanth Reddy: గుడి లేని ఊరు ఉందేమో కానీ.. ఇందిరమ్మ ఇళ్లు లేని పల్లె లేదు: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
గుడి లేని ఊరు ఉందేమో కానీ.. ఇందిరమ్మ ఇళ్లు (Indiramma House) లేని పల్లె లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: గుడి లేని ఊరు ఉందేమో కానీ.. ఇందిరమ్మ ఇళ్లు (Indiramma House) లేని పల్లె లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ సచివాలయం (Secretariat)లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మ గౌరవంతో బతకాలనేది ప్రతి ఒక్కరి కల అని అన్నారు. పేదల కలను ఆనాడే ఇందిరా గాంధీ (Indira Gandhi) గుర్తించిందని తెలిపారు. కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికీ అందించాలనేది ఇందిరమ్మ ఆలోచన అని అన్నారు. వ్యవసాయ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ (Land Ceiling Act)తో పేదలకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఒక్క తెలంగాణ (Telangana)లోనే 35 లక్షల భూ పంపకాలు చేపట్టారు. లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపం ఉంటే విశ్వసనీనత దెబ్బ తింటుందని అన్నారు.
నిజమైన అర్హులకే ఇళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఏఐ టెక్నాలజీ (AI Technology)ని ఉపయోగించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అన్నారు. తొలి ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. కేసీఆర్ (KCR) రద్దు చేసిన హౌసింగ్ డిపార్ట్‌మెంట్ (Housing Department)ను కూడా పునరుద్ధరించామని తెలిపారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నిబంధనలను సవరించామని అన్నారు. గోండులు, ఆదివాసీలకు మేలు చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్ల పరిశీలనతో పాటు ఏఐ సాంకేతికతను ఉపయోగించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో 60 వేల నుంచి 65 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. వాళ్లు అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను కూడా తాము పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు.