CM Revanth Reddy: యాదాద్రిలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు (శుక్రవారం) ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రులతో కలిసి ఆలయంలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి ఆలయ ప్రధానార్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి చిత్రం ముద్రించిన శాలువాతో సీఎంను సత్కరించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆలయంలోని వసతులపై అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు.
కాగా.. అంతకుముందు తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రికి, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట హెలిప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌రూమ్‌కి చేరుకున్న సీఎం.. అనంతరం విష్ణు పుష్కరిణి చేరుకుని అంజలి ఘటించారు. అక్కడ నుంచి సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్నారు. ముందుగా అఖండ దీపారాధనను దర్శించుకుని దీపం వెలిగించి పూజలు చేశారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల, పొన్నం, కొండా సురేఖ ఉన్నారు. ఇక వైటీడీ అధికారులతో సమీక్ష అనంతరం మూసీ ప్రవహించే సంగెం బ్రిడ్జి వద్దకు చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.