ధరణి సమస్యలపై CM రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు
రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లను పంద్రాగస్టులోగా పరిష్కరించాలని కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లను పంద్రాగస్టులోగా పరిష్కరించాలని కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో కొనసాగుతున్న సదస్సులో ధరణి పోర్టల్, భూ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ధరణి సమస్యల పరిష్కారం వివరాలను సీఎం ఆరా తీశారు. పెండింగులో ఉన్న వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తు చేసే వారికి అప్లికేషన్ల తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఫైల్ ని రిజెక్ట్ చేసినా దానికి తగిన కారణం దరఖాస్తుదారుడికి తెలియాలన్నారు.
ధరణి పోర్టల్‌లో కొన్ని టెక్నికల్ సమస్యలకు పరిష్కారం చూపేలా అదనపు ఆప్షన్స్ పొందుపరిచే అంశాన్ని పరిశీలించాలించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 లోగా పెండింగ్ లోని ధరణి సమస్యలను పరిష్కరించాలన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు. వారం వారం ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ టార్గెట్లు పెట్టారు. ఐనా పరిష్కారంపై ఆశించిన పురోగతి లేకపోవడం గమనార్హం. ప్రధానంగా టీఎం 15, టీఎం 33 అప్లికేషన్లే అధికంగా ఉన్నాయి.