CM Revanth: ఒక్క రోజులోనే అంచనాకు మించిన వర్షం

తుపాను వర్షాల కారణంగా రాష్ట్రంలో సంభవించిన వరదలు, జరిగిన నష్టానికి కేంద్రమే తగిన ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Update: 2024-09-06 16:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తుపాను వర్షాల కారణంగా రాష్ట్రంలో సంభవించిన వరదలు, జరిగిన నష్టానికి కేంద్రమే తగిన ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తక్షణం చేపట్టాల్సిన మరమ్మత్తు పనులు, పునరుద్ధరణ చర్యలకు సాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు కూడా నిధులివ్వాలని కోరారు. నిధుల కేటాయింపు, విడుదలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ మార్గదర్శకాలను (గైడ్‌లైన్స్) సడలించాలని కోరారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే చేసిన అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పై విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరద నష్టం ప్రాథమిక అంచనా సుమారు రూ. 5,438 కోట్లు అని తెలిపారు.

భారీ వర్షాలు, వరద బీభత్సంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ వివరించారు. అన్ని శాఖల అధికారుల నుంచి తెప్పించిన ప్రాథమిక వివరాల ప్రకారం వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని విభాగాలూ క్షేత్రస్థాయిలో వాస్తవంగా జరిగిన నష్టం వివరాలను సేకరిస్తున్నాయని, సమగ్రంగా అంచనాల తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందని కేంద్ర మంత్రికి వివరించారు. వరద నష్టం తీవ్రతను ఫొటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో ఒక్క రోజులోనే అత్యధికంగా 40 సెం.మీ. మేర వర్షం కురిసిందని తెలిపారు.

వాతావరణ కేంధ్రం హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్నారు. కానీ వరద నష్టం మాత్రం భారీగానే జరిగిందన్నారు. ఒక్క రోజులోనే అంచనాకు మించిన వర్షం పడటంతో ప్రధాన రహదారులతో పాటు రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జిలు చాలాచోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో వరదలో కట్ట కొట్టుకుపోవటంతో వేలాడుతున్న రైల్వే ట్రాక్ పరిస్థితిని, రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయాయని, ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని తెలిపారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని అధికారులు వివరించారు.

తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగినన్ని నిధులనూ కేటాయించాలని కోరారు. విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో 50% ఉపయోగిస్తే.. ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకునేలా గతంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉండేదన్నారు. మూడేండ్ల క్రితం (2021) వరకూ ఇదే విధానం అమల్లో ఉండేదని, ఇప్పుడు 100% ఎస్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రాలు వినియోగిస్తేనే, శాశ్వత మరమ్మతు పనులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలనే నిబంధన వచ్చినట్లు గుర్తుచేశారు. గతంలో ఉన్న తరహాలోనే నిబంధనలను సడలించాలని కోరారు.

వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాలవారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లను కూడా పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతు పనులకు కనీసం రూ. 60 కోట్లు అవసరమవుతాయని, ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం రూ. 4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని కేంద్ర మంత్రికి వివిధ శాఖల అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ నష్టం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయని, అందుకే ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరులో తెలంగాణకూ కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని నొక్కిచెప్పారు.

విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు, రాజకీయాలకు తావు లేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టంచేశారు. పార్టీలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, బండి సంజయ్‌తో సీం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Similar News