ఆ తర్వాతే ‘స్థానిక’ ఎన్నికల షెడ్యూలు.. CM రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ
కులగణన చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నదని, స్టేట్ బీసీ కమిషన్ సైతం ఆ సన్నాహాల్లోనే ఉన్నదని, దసరా పండగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియ మొదలవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కులగణన చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నదని, స్టేట్ బీసీ కమిషన్ సైతం ఆ సన్నాహాల్లోనే ఉన్నదని, దసరా పండగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియ మొదలవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో, బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను పెంచుతామని నొక్కిచెప్పారు. కులగణన ప్రక్రియను 60 రోజుల వ్యవధిలో పూర్తిచేసి డిసెంబరు 9 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేస్తామన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల (గ్రామీణ) ఎన్నికలు జరుగుతాయన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ సహా పలువురు బీసీ ఎమ్మెల్యేలు కులగణన విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్ళి చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కుల గణనపై క్లారిటీ ఇచ్చారు.
కులగణనతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున బీసీ సంఘాలన్నీ సహకరించాలని సీఎం రిక్వెస్టు చేశారు. కులగణన ఎలా జరగాలో స్టేట్ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులతో పాటు వివిధ శాఖల అధికారులతో రివ్యూ జరిగిందని, రాష్ట్ర ప్రణాళికా (ప్లానింగ్) బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుందనే స్పష్టత వచ్చిందని వీరికి సీఎం వివరించారు. అవసరమైనంత సిబ్బందిని ప్లానింగ్ బోర్డు సమకూర్చడంతో పాటు ఏయే శాఖలతో సమన్వయించుకోవాలో కూడా ఆ విభాగమే చూసుకుంటుందని తెలిపారు. బీసీ కమిషన్‌కు, ప్లానింగ్ బోర్డుకు సమన్వయకర్తగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్లు కూడా బీసీ సంఘాల ప్రతినిధులకు సీఎం వివరించారు. ఇంటింటి సర్వేలో కులాల వివరాలను సేకరించడంతో పాటు బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక వెనకబాటుతనంపైనా తగిన ప్రశ్నావళి, ప్రొఫార్మా, డాటాబేస్ రూపకల్పన తదితరాలపైనా మెకానిజం రూపొందినట్లు వివరించారు.
కులగణనపై రాష్ర్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీసీ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రణాళిక విభాగం ద్వారా కులగనణ నిర్వహించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎంకు తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతమయ్యేందుకు తమ వంతు కృషి, సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదేశాలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను సీఎం గుర్తుచేశారని, సమగ్ర కులగణన పూర్తిచేసి బీసీ రిజర్వేషన్లను పెంచడానికి కట్టుబడి ఉన్నట్లు సీఎం తమకు వివరించారని జాజుల శ్రీనివాసగౌడ్ మీడియాకు తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు బీసీ కమిషన్‌ను నియమించి కులగణనకు ఎలాంటి అవరోధాలు, న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న విషయాన్ని కూడా సీఎం తమకు వివరించారని పేర్కొన్నారు.
కులగనన విజయవంతమయ్యేందుకు వీలుగా బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు సమన్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం కోరినట్లు తెలిపారు. ఈ కులగణన చారిత్రాత్మకంగా ఉంటుందని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా చేపడతున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్న అంశాన్ని కూడా నొక్కిచెప్పారని జాజుల శ్రీనివాసగౌడ్ తెలిపారు. బీసీ మేధావులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ చిరంజీవిలు, బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యాంకుర్మ, ప్రొఫెసర్ బాగయ్య, వేముల వెంకటేష్, ఉప్పరి శేఖర్ సగర, వేణుమాధవ్, బి మణి మంజరి, సింగం నగేష్, గొడుగు మహేష్ యాదవ్, తదితరులు సీఎంతో జరిగిన భేటీలో పాల్గొన్నారు.