దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయండి.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

బీఆర్ఎస్ నేతల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

Update: 2024-08-20 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సోమాజీగూడలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారని.. ‘చేతనైనే ఆ విగ్రహాన్ని టచ్ చేయండి.. అంతు చూస్తాం’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అధికారం పోయినా కొందరికి అహంకారం తగ్గడం లేదని మండిపడ్డారు. సచివాలయం ఎదుట కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పదేళ్లలో ఏనాడూ విగ్రహం పెట్టాలనే ఆలోచన రాని వాళ్లకు ఇవాళ ప్రశ్నించే నైతిక లేదని అన్నారు.

వచ్చే డిసెంబర్ 9వ తేదీలోపు సచివాయంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతామని కీలక ప్రకటన చేశారు. ఈ విగ్రహాన్ని సచివాలయం లోపలే పెడతామని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశాక.. ఏ రోజు తొలగిస్తారో చెబితే తాము కూడా వస్తామని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకోకముందే ఏమవుతుందో చూపిస్తామని హెచ్చరించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. ఇవాళే ప్రారంభం చేయాలని ముందుగా నిర్ణయం తీసుకున్నాం.. కానీ, ఇంకా కొన్ని పనులు మిగిలి ఉండటం మూలంగా వాయిదా వేసుకున్నామని తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహం అమరవీరుల జ్యోతి పక్కన ఉండటం సముచితం అని అన్నారు. ఆయన విగ్రహం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని వెల్లడించారు. అధికారం కోల్పోయేసరికి బీఆర్ఎస్ నేతలు విచక్షణ మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..