CM Revanth: తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు నేడు సీఎం భూమి పూజ

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ప్రాంగణంలోనే ప్రతిష్ఠించేందుకు వీలుగా సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు భూమి పూజ చేయనున్నారు.

Update: 2024-08-28 03:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ప్రాంగణంలోనే ప్రతిష్ఠించేందుకు వీలుగా సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు భూమి పూజ చేయనున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనపై సీఎం రేవంత్‌ నాలుగు రోజుల క్రితమే ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై 2009 డిసెంబరు 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు ప్రతీకగా అదే తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు స్పష్టత ఇచ్చారు. దానికి అనుగుణంగా డిప్యూటీ సీఎం, మంత్రులు, పలువురు అధికారులతో కలిసి సచివాలయంలో పోర్టికోకు ముందువైపున నిర్దిష్టంగా విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలనే విషయమై చర్చించుకుని ఫైనల్ చేశారు. ప్రధాన ప్రవేశ ద్వారం (మెయిన్ గేట్) నుంచి భవనం లోపలకు వెళ్ళే దారిలోనే పోర్టికో దగ్గరకు వెళ్ళడానికంటే ముందే ప్రతిష్ఠించాలని సైట్‌ను ఖరారు చేశారు. ఆ నిర్ణయం మేరకు బుధవారం ఉదయం పలువురు మంత్రులతో కలిసి భూమి పూజ చేయనున్నారు. డిసెంబరు 9న లాంఛనంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వీలుగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని (డిజైన్) కూడా రానున్న రోజుల్లో ఖరారు చేయనున్నారు. ఇప్పటికే జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీకి చెందిన పలువురు కళాకారులు, ఆర్టిస్టులు నమూనాతో పాటు మీనియేచర్‌ను సీఎంకు చూపించారు. అందులో ఉత్తమంగా ఉన్నదాన్ని ఎంపిక చేసి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొన్ని సూచనలు చేయనున్నారు. దయాగుణం, త్యాగం, సగటు మహిళ రూపం, సంస్కృతీ సంప్రదాయాలు రిఫ్లెక్ట్ అయ్యేలా విగ్రహం ఉండాలని గతంలోనే సీఎం కామెంట్ చేశారు. దానికి తగినట్లుగానే తయారయ్యే అవకాశమున్నది.


Similar News