జాతీయ విపత్తుగా పరిగణించండి.. ప్రధాని మోడీకి CM రేవంత్ విజ్ఞప్తి
ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో మంత్రులంతా ప్రజల వద్దే.. అందుబాటులో ఉండాలని సూచించారు. వరద ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోయారని తెలిపారు. అలంతేకాదు.. ఈ వరదల వల్ల రూ.వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగి రైతులు కోలుకోలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. పాలేరు ప్రాంతంలోని రాజీవ్ గృహకల్ప ప్రజల పరిస్థితి స్వయంగా చూశానని.. అండగా ఉంటామని హామీ ఇచ్చామని తెలిపారు. వరద ప్రాంతాల్లో అంటువ్యాధుల పట్ల ప్రజలతో పాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తిరిగుతూ వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.
అంటు వ్యాధులు ప్రబలకుండా నిత్యం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా.. కొంత నష్టం తప్పలేదని అన్నారు. అధికార యంత్రాంగం పనితీరు, ముందస్తు చర్యల కారణంగా ప్రాణ నష్టం జరుగకుండా చూసుకోగలిగామని అభిప్రాయపడ్డారు. గత మూడ్రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజల్లోనే ఉన్నారని స్పష్టం చేశారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన నష్టాన్ని ఇప్పటికే అంచనా వేశామని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో తెలంగాణకు అండగా ఉండాలని.. ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశామని అన్నారు. దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరామని తెలిపారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వరదల వల్ల రూ.5,430 వేల కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. స్వయంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని ఈ సందర్భంగా ప్రధానిని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని కోరారు.
తక్షణమే రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. అంతేగాకుండా.. దెబ్బతిన్న రోడ్లు త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అకాల విపత్తు కారణంగా రాష్ట్ర ప్రజలు అల్లకల్లోలం అవుతుంటే.. వరదలతో కేసీఆర్ బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లడం కేసీఆర్ బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని చురకలు అంటించారు. ఏ రాష్ట్రంలో అయినా ప్రజలకు కష్టం వల్లే అక్కడికి ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్షాలు వెళ్లాలి కానీ.. ఇక్కడ పరిస్థితి రివర్స్ ఉందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు పట్టించుకోకపోగా.. విపక్షాలు విమర్శలు చేయడం దురదృష్టకరం అని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్, ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్‌లు.. ప్రజల్లో తిరుగుతున్న మంత్రులపై విమర్శలు చేయడం దారుణమని విమర్శించారు.