నాకు సీఎం పదవి పెద్ద విషయం కాదు.. ఎమ్మెల్యేల వలసల వేళ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
నాకు సీఎం పదవి విషయంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని కొన్ని కొన్ని సార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 'పాలిచ్చే బర్రెను వదులుకుని దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది' అని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్.. ఎంపికచేసిన నియోజక వర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆర్మూర్, హుజూరాబాద్ నియోజక వర్గాలకు చెందిన నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దారికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలనలో దారి తప్పుతోదంని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. నాడు ఎన్టీఆర్ ను ఎలాగైతే ప్రజలు తిరిగి గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారని, అంతకంటే రెట్టింపు మద్దతుతో ప్రజలు అధికారం కట్టబెట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు.
కార్యకర్తలే నాయకులు:
నాయకులను పార్టీనే సృష్టిస్తుదని, కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని కేసీఆర్ అన్నారు. నాయకులు పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారు.. వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయీలుగా తయారౌతారని చెప్పారు. ప్రజల్లో చైతన్యం వచ్చి కాంగ్రెస్ ద్వారా జరిగిన మోసాన్ని గుర్తించి తిరిగి బీఆర్ఎస్ ను ఆదరిస్తారని అప్పటి వరకు ఓపికతో ప్రజాసమస్యలపై దృష్టి సారించాలన్నారు. పట్టుదలతో ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించేనాటికి మనది సమైక్యపాలనలో దిక్కు మొక్కు లేని పరిస్థితి ఉండేదని పదేండ్ల అనతికాలం లోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామన్నారు.