ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
రెండు చోట్ల పోటీ చేయడంపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను కామారెడ్డిలో పోటీ చేయడానికి ప్రత్యేక కారణం ఉందని చెప్పారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ
దిశ, డైనమిక్ బ్యూరో: రెండు చోట్ల పోటీ చేయడంపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను కామారెడ్డిలో పోటీ చేయడానికి ప్రత్యేక కారణం ఉందని చెప్పారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో మేడ్చల్ జిల్లా అంతాయిపల్లి తూంకుంటలోని కన్వెన్షన్ హాల్‌లో అత్యవసరంగా సమావేశమైన కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గజ్వేల్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, గజ్వేల్ బిడ్డలు తనను రెండు సార్లు కడుపులో పెట్టుకుని గెలిపించారని చెప్పారు. వచ్చే సారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ప్రతి నెల ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉండి అక్కడి ప్రజలతోనే గడుపుతూ అభివృద్ధి పనులను సమీక్షిస్తానన్నారు.
మీకేం కావాలో నేను చేయిస్తానని భరోసా ఇచ్చారు. రెండు చోట్ల గెలిచినా గజ్వేల్‌ను వదిలే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంత మెజార్టీతో గెలిపిస్తారనేది మీ దయ అని చెప్పుకొచ్చారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు భూములు కోల్పోయిన వారి బాధ చాల పెద్దదని, నాకు కూడా బాధగానే ఉందన్నారు. అయితే భూములు కోల్పోయిన వారికి తెలంగాణ రైతాంగం బుుణపడి ఉందన్నారు. అభివృద్ధి ఆగొద్దంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలన్నారు. గెలుపుపై డౌట్ లేదని 95 నుంచి 105 స్థాన్నాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ మాటల వెనుక మర్మం ఏంటి?:
గజ్వేల్ బీఆర్ఎస్‌లో ముసలం మొదలైన నేపథ్యంలో పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశం అయిన కేసీఆర్ వారితో చెప్పిన మాటలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. రెండు చోట్ల గెలిచినా గజ్వేల్ నుంచే ప్రాతినిథ్యం వహిస్తాననేలా నేతలకు భరోసా ఇవ్వడంతో కామారెడ్డిలో గెలిస్తే అక్కడ కేసీఆర్ రాజీనామా చేస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కామారెడ్డిలో పోటీ చేయడానికి కేసీఆర్‌కు ఉన్న ప్రత్యేక కారణం ఏంటనేది ఉత్కంఠగా మారింది. ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ తిరుగులేని నేతగా ఉన్నారని.. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా అక్కడ గెలుపు ఖాయం అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న వేళ కేసీఆర్ మాత్రం గజ్వేల్ నాయకులతో సెంటిమెట్ కామెంట్స్ చేయడం పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తిగా మారింది.