బిగ్ న్యూస్: వ్యూహం మార్చిన KCR.. ఆ వర్గం ఓటర్లకు దగ్గరయ్యేందుకు భారీ స్కెచ్!
దళితబంధు, రైతుబంధు స్కీమ్‌లతో వివిధ సెక్షన్ల ప్రజలకు దగ్గరయ్యామని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బీసీ సామాజికవర్గాలకు చేరువ కావాలనుకుంటున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: దళితబంధు, రైతుబంధు స్కీమ్‌లతో వివిధ సెక్షన్ల ప్రజలకు దగ్గరయ్యామని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బీసీ సామాజికవర్గాలకు చేరువ కావాలనుకుంటున్నది. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వివిధ బీసీ కులాలకు చెందినవారికి తలా లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓటు బ్యాంకును ఆకట్టుకునేలా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. అందులో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లోనే లాంఛనంగా ఈ స్కీమ్‌ను ప్రారంభించేలా షెడ్యూలు తయారైంది. ఈ పథకం అమలు కోసం రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు ఆ మంత్రిత్వశాఖ వర్గాల ద్వారా తెలిసింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి దగ్గర స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లను ప్రభుత్వం ఉంచింది. గతేడాది ఇది కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే. ఈసారి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరాలు కురిపించేందుకు, ఎన్నికల ప్రచారం సందర్భంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పాల్గొనే సభలలో హామీలు గుప్పించేందుకు, ఆ నిధులను విడుదల చేసి అభివృద్ధి పనులను ప్రారంభించేలా ముఖ్యమంత్రి నేతృత్వంలో బడ్జెట్ తయారైంది. ఒకే సంవత్సరం ఐదు రెట్ల మేర ఎస్డీఎఫ్ నిధులను సీఎం విచక్షణ ప్రకారం ఖర్చు చేయడానికి కేటాయించినప్పుడే ఇది ఎలక్షన్ ఫండ్ అనే విమర్శలు వినిపించాయి. అది నిజమేనని తాజా క్యాబినెట్ సమావేశం నిర్ణయం రూఢీ చేస్తున్నది.
బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడం కోసం ఇందులో నుంచి రూ. 2 వేల కోట్లను కులవృత్తుల బీసీలకు లక్ష చొప్పున ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సంవత్సరం సుమారు రెండు లక్షల మందికి ఈ రూపంలో ఆర్థిక సాయం అందించేలా బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే దీని అమలుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందనున్నాయి.
దళితులకు దళితబంధు, రైతులకు రైతుబంధు ఇస్తున్నట్లుగానే బీసీలకు కూడా బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్లు వచ్చాయి. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నందున అందరికీ వర్తింపజేయడానికి ప్రభుత్వ ఖజానా సరిపోదనే భావనతో కులవృత్తులవారికి మాత్రం సాయం చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
సమగ్ర కుటుంబ సర్వేలోని వివరాల ఆధారంగా ఈ స్కీమ్ అమలయ్యే అవకాశం ఉన్నట్లు బీసీ వెల్పేర్ డిపార్టుమెంటు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే సమయానికే దళితబంధు, సొంత జాగ ఉన్నవారికి తలా రూ. 3 లక్షల చొప్పున ఇల్లు కట్టుకోడానికి సాయం, ఇప్పుడు కులవృత్తుల బీసీలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం లాంటివి లాంఛనంగా ప్రారంభించి వాటి ఫలాలతో ఖుష్ చేయాలని సీఎం భావిస్తున్నారు.
వచ్చే నెలలో రైతుబంధుతో పాటు ఎన్నికలు జరిగే సమయానికి మరో విడత కూడా రైతుల ఖాతాల్లో జమ కానున్నది. అదే సమయానికి దళితబంధు నిధులు కూడా కొద్దిమంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి ఇప్పటి నుంచే ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవడం మొదలైంది.
ఇప్పటికే ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ స్టేట్ లీడర్లు బీసీలను ఆకట్టుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించనున్నట్లు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఆ సెక్షన్ ఓటర్లకు దగ్గరవుతున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ బీసీ మోర్చా సమావేశంలో సైతం బీసీ సంక్షేమం గురించి ప్రస్తావించారు.
గతేడాది ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు బీసీలకు ఇచ్చిన ఫండ్స్, ఆర్థిక సాయంపై శ్వేతపత్రం సమర్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నదని, ఆయన క్యాబినెట్‌ను చూస్తే బీసీ మంత్రులు ఎందరు ఉన్నారో అర్థమవుతున్నదని వ్యాఖ్యానించారు.
మరోవైపు కాంగ్రెస్ సైతం బీసీ జపమే చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లోపు మొత్తం తొమ్మిది డిక్లరేషన్‌లను ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. అందులో బీసీ డిక్లరేషన్ కూడా ఒకటి. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతుల మీదుగా త్వరలో దీన్ని ఆవిష్కరించేలా రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారు. ఇప్పటికే యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్‌లను ప్రకటించారు.
ఇకపైన మహిళా డిక్లరేషన్, ఎస్సీ-ఎస్టీ డిక్లరేషన్ కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. స్పష్టమైన హామీలతో బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడంతో పాటు తొమ్మిదేళ్ళ కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయాన్ని కూడా ఏకరువు పెట్టాలన్నది కాంగ్రెస్, బీజేపీ ప్లాన్. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ సైతం బీసీకు చేరువయ్యేందుకు ఆలోచిస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా అమలులోకి రాని కొన్ని పథకాలపై విమర్శలు వస్తున్న సమయంలో కొత్త స్కీమ్‌లను తెరపైకి తెచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి దగ్గరున్న ఎస్డీఎఫ్ నిధులను రానున్న రోజుల్లో ఇంకెలాంటి కొత్త పథకాలు తీసుకొస్తారో, ప్రచారం సందర్భంగా నియోజకవర్గాలకు కురిపించే వరాలు ఏ స్థాయిలో ఉంటాయోననే చర్చ విపక్షాల్లో మొదలైంది.
గతంకంటే చాలా భిన్నంగా ఈసారి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల (ఐ అండ్ పీఆర్ డిపార్టుమెంటు) శాఖకు వెయ్యి కోట్లను బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది. తొమ్మిదేళ్ళ పాలనలోని ఫలాలను, విజయాలను దశాబ్ది వేడుకల సందర్భంగా విస్తృతంగా పబ్లిసిటీ చేసుకోడానికి ఈ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయనున్నది.