వచ్చే ఎన్నికల్లో ఓటమికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉండాలి: MP లక్ష్మణ్
‘బీజేపీలో విబేధాలు’ అనే శీర్షికతో కరీంనగర్ జిల్లా ఎడిషన్‌లో వచ్చిన వార్తపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: ‘బీజేపీలో విబేధాలు’ అనే శీర్షికతో కరీంనగర్ జిల్లా ఎడిషన్‌లో వచ్చిన వార్తపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇది కావాలని కొందరు నేతలు కల్పించిన కట్టు కథలని, విబేధాలు లేవని, అసత్యపు ప్రచారానికి తనతో ఉన్న ఫోటోను కొందరు నేతలు వాడుకోవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నాయకత్వం గ్రూపులు, అసమ్మతి కార్యక్రమాల పేరుతో పార్టీని బలహీనపర్చే చర్యలను ఉపేక్షించాల్సిన అవసరం లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వానికి లక్ష్మణ్ సూచించినట్లు తెలిసింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. సదరు పత్రికలో వచ్చిన వార్త లక్ష్మణ్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే బండి సంజయ్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం.
పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించామే తప్ప విబేధాల అంశమే చర్చకు రాలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్ర్రంలో ప్రజా సమస్యలపై అలుపెరగని కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తరుణంలో ఇలాంటి దుష్ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని భావిస్తున్న తరుణంలో జిల్లాలో పార్టీ ఎదుగదలకు అడ్డంకి సృష్టించేలా తప్పుడు సమాచారం అందిస్తున్న వారిని గుర్తించి భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌కు సూచించినట్లు సమాచారం.
ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు చూస్తుంటే దేశ వ్యాప్తంగా మోడీ సర్కారుకు ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధమవుతున్నారనేది అర్థమవుతోందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఈ గెలుపు అసంబద్ధ పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు చెంపపెట్టు అని అన్నారు. మణిపూర్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇన్నేండ్లు నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య రాష్ట్రాలు మోడీ సర్కారు వచ్చిన తర్వాత అభివృద్ధిని చూశాయని, అందుకే అక్కడి ప్రజలు బీజేపీకి ఓటేస్తున్నారని పేర్కొన్నారు.
త్రిపురలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కేవలం అధికారం కోసం పొత్తులు పెట్టుకున్నారని, ఆ పార్టీల కలయికను ప్రజలు తిప్పికొట్టారని ఆయన అన్నారు. నాగాలాండ్‌లో మెజారిటీ క్రిస్టియన్ ప్రజలు ఉన్నా కేవలం అభివృద్ధి కోసమే ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని అన్నారు. మేఘాలయతో పాటు మూడు రాష్ట్రాల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు రావడం మంచి పరిణామమని కొనియాడారు. నిరంతరం మోడీని దూషించే కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు వచ్చే ఎన్నికల్లో ఓటమికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.