గులాబీని వీడేవారెవరు.. రంగంలోకి CM కేసీఆర్.. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పెషల్ ఫోకస్..?
అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్ది గులాబీ పార్టీలోని అసమ్మతి నేతలు పార్టీని వీడుతున్నారు. కొంతమందికి పదవులు ఇచ్చినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే కారణంతో రాజీనామాలు చేస్తుండటంతో
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్ది గులాబీ పార్టీలోని అసమ్మతి నేతలు పార్టీని వీడుతున్నారు. కొంతమందికి పదవులు ఇచ్చినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే కారణంతో రాజీనామాలు చేస్తుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్టు అయింది. జిల్లాల వారీగా అసమ్మతి నేతలు పార్టీవీడేందుకు ఎవరు సిద్ధమవుతున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ టికెట్ కేటాయించకపోవడంతో కేసీఆర్ గుర్రుగా ఉండటంతో పాటు పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి వ్యవహారంపైనా ఆరా తీస్తుంది. వారి సెకండ్ కేడర్ పైనా కేసీఆర్ దృష్టిసారించారు.
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండునెలల వ్యవధిమాత్రమే ఉంది. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాని ఆశావాహులు ఇప్పటికే పలువురు పార్టీని వీడారు. ఎమ్మెల్సీగా ప్రస్తుతం పనిచేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీకి రాజీనామాచేశారు. మరో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డిసైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనం హనుమంతరావుసైతం కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. అంతేకాదు ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం రాజీనామాచేసి కాంగ్రెస్ గూటికీ చేరారు.
రోజురోజుకు కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, బీఆర్ఎస్ అసంతృప్తి నేతలు సైతం ఆపార్టీలో చేరుతుండటంతో బలోపేతం అవుతుంది. దీంతో గులాబీ అధిష్టానం అలర్టై జిల్లాల వారీగా మరోసారి అసంతృప్తి నేతలతోపాటు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న నేతల వివరాలను సేకరిస్తుంది. వారు పార్టీని వీడకుండా చర్యలు చేపడుతుంది. ప్రగతి భవన్ కు కొందరు అసమ్మతి నేతలను పిలిపించుకొని వారికి నామినేటెడ్ పదవుల హామీ ఇచ్చినప్పటికీ గ్యారంటీ లేదనే అసంతృప్తితో పార్టీని వీడుతుండటం బీఆర్ఎస్ కు ఎఫెక్ట్ అవుతుంది.
ఆ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్
బీఆర్ఎస్ అధిష్టానం నిర్వహించిన సర్వేల్లో సిట్టింగ్‌లపై సానుకూలంగా రాలేదనే సాకుతో కేసీఆర్ టికెట్ నిరాకరించారు. అందులో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలకు టికెట్ ప్రకటించలేదు. జనగాం, నర్సాపూర్‌ను పెండింగ్‌లో పెట్టారు. అయితే ఆ నియోజకవర్గాల్లో మరో నేతలకు ప్రచారం చేసుకోవాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే రానివారిని నామినేటెడ్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ససేమీరా అంటున్నారు.
ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబడుతూ నిరంతరం ప్రజాకార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీల్లో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారుపార్టీ వీడకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖానాపూర్, బోథ్, ఆసీఫాబాద్ సిట్టింగ్ లు అసమ్మతి స్వరం వినిపించడంతో ప్రభుత్వ పథకాల్లో సిఫార్సు బాధ్యతల నుంచి తప్పించినట్లు సమాచారం. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ కు సిఫార్సు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
మోత్కుపల్లి వ్యవహారంపైనా ఆరా
దళిత నేతగా మోత్కుపల్లికి పేరుంది. గత రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ లోచేరిన మోత్కుపల్లి నర్సింహులు పార్టీలో సముచితస్థానం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కేసీఆర్ నామినేటెడ్ పదవి ఇస్తారని ఆశించారు. కనీసం ఎమ్మెల్యే టికెట్ అయినా కేటాస్తారని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. గత రెండునెలల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లా లో పోటీచేసే అవకాశం కల్పించాలని కేసీఆర్ కోరారు. అయినప్పటికీ కేసీఆర్ ప్రకటించిన లిస్టులో ఆయన పేరు లేకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు.
చంద్రబాబును ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్‌లో అక్రమాలు జరిగాయని అరెస్టు చేయడంతో అందుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మళ్లీ మూడ్రోజుల వ్యవధిలోనే కర్నాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను మోత్కుపల్లి కలిశారు. దీంతో కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు తన సపోర్టులేనిదే ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఒక్కసీటు కూడా గెలువలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరి తుంగతుర్తి నుంచి పోటీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే మోత్కుపల్లి ఏం చేస్తున్నాడనే దానిపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.
సెకండ్ కేడర్ పైనా దృష్టి
ఎవరూ పార్టీని ధిక్కరిస్తున్నారో వారి సెకండ్ లీడర్లపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించింది. ఖానాపూర్ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ప్రధాన అనుచరులుగా ఉన్న ఆదిలాబాద్ జడ్పీచైర్ పర్సన్ రాథోడ్ జనార్దన్, ఖానాపూర్ నేత బాదావత్ పూర్ణచందర్ నాయక్‌లతో అధిష్టానం సంప్రదింపులు చేసి శాంతపరిచింది. జాన్సన్ నాయక్‌ను గెలుపుకోసం కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా వైరా, ఆసిఫాబాద్, ఉప్పల్ నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌లకు ప్రధాన అనుచరులుగా ఉన్నవారు పార్టీని వీడకుండా చర్యలు చేపడుతుంది. ఇలా అసమ్మతి ఉన్న నేతలు పార్టీని వీడినా సెకండ్ లీడర్‌లను కట్టడిచేసేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.