సీట్లు తగ్గినా హ్యాట్రిక్ పక్కా.. గులాబీ నేతలకు సీఎం KCR భరోసా
బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ భరోసా కల్పించారు. మూడోసారి అధికారంలోకి వస్తున్నామని స్పష్టంచేశారు. శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ భరోసా కల్పించారు. మూడోసారి అధికారంలోకి వస్తున్నామని స్పష్టంచేశారు. శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ కేకే, పలువురు సీనియర్ నేతలతో గులాబీ బాస్ భేటీ అయ్యారు. పోలింగ్ సరళిపై ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్షించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు, హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలు, పాలమూరు ఎమ్మెల్యేలతోపాటు మంత్రి నిరంజన్‌రెడ్డి సైతం కేసీఆర్‌ను కలిశారు.
నియోజకవర్గాల వారీగా వివరాలు అందజేశారు. కాగా ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది. ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎంత మార్జిన్ వస్తుందని ఆరా తీసినట్లు సమాచారం. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మవద్దని.. పార్టీ సేకరించిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా బీఆర్ఎస్ గెలుస్తుందని నేతలకు సూచించారు. గతం కంటే కొన్ని సీట్లు తగ్గుతున్నాయని నేతలతో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ కొట్టిన తొలి పార్టీగా బీఆర్ఎస్ రికార్డ్ క్రియేట్ చేస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పలువురికి మందలింపు..!
వందరోజుల ముందు పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించినప్పటికీ ఎందుకు ఓటుగా మల్చుకోలేకపోయారని సర్వేల ఫీడ్ బ్యాక్‌ను బట్టి కేసీఆర్ పలువురు బీఆర్ఎస్ నేతలను మందలించినట్లు సమాచారం. తీరు మార్చుకోవాలని, కేడర్‌ను, నేతలను కలుపుకొని పోవాలని ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం బేఖాతర్ చేశారని, అందుకు వారే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడినట్లు సమాచారం. వారి ప్రభావం పార్టీపైనా పడుతుందని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది.
3న ప్రమాణస్వీకారం తేదీని ప్రకటిస్తా
అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ జరగనున్న ఈనెల 3వ తేదీ సాయంత్రమే ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటిస్తామని కేసీఆర్.. నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. ఫలితాలు బీఆర్ఎస్కు అనుకూలంగా వస్తున్నాయని, ఎవరూ అదైర్య పడొద్దు.. ఇచ్చిన హామీలు నెరవేరుద్దామంటూ నేతల భేటీలో అధినేత చెప్పినట్లు తెలిసింది. సుపరిపాలన అందించబోతున్నామని, 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందామని కేసీఆర్ నేతలకు ధీమా కల్పిచినట్లు సమాచారం.
కవితను ఇంట్లోనే కలిసిన నిజామాబాద్ నేతలు
ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో గురువారం ఎన్నికల పోలింగ్ ముగియడంతో నేతలంతా శుక్రవారం హైదరాబాద్‌లో ఆమెతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలతో నేతలు రావడంతో వారితో సుధీర్ఘంగా చర్చించారు. ఏయే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ఎన్ని ఓట్లు పడ్డాయని కవిత ఆరా తీసినట్లు సమాచారం.