బీసీలకు సీఎం కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

కొత్త సెక్రటేరియట్‌లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2023-05-19 02:45 GMT

కొత్త సెక్రటేరియట్‌లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థికంగా చితికిపోయిన బీసీ కులాలకు చేయూతనిచ్చేందుకు ప్రతి కుటుంబానికీ రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు జరిగే రాష్ట్ర దశాబ్ది వేడుకుల సందర్భంగా బీసీ కులాలకు ఈ సాయం అందజేయాలని కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. ఈ స్కీమ్ విధివిధానాల కోసం మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో పాటు వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తూ, 111 జీవోను రద్దు చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మీటింగ్ అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాకు వివరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ నేతృత్వంలో నూతన సెక్రటేరియట్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంత వరకూ ప్రభుత్వం తరుఫున ఎలాంటి ఆర్థిక సాహాయమూ అందని బీసీ కులాలకు రూ.లక్ష అందజేయాలని మీటింగ్‌లో నిర్ణయించారు. అందులో భాగంగా వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, దర్జీ, కంసాలి, మంగలి, చాకలి, మేదరి, వడ్డరి‌తో పాటు ఇతర కుల వృత్తులను ఆదుకోవాలని అభిప్రాయపడింది. దళితబందు స్కీం తరహాలో దశల వారీగా ఒక్కో కులానికి సగటున 5,000 మందికి ఫస్ట్ ఫేజ్‌లో అందజేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు.

అయితే ఏయే కులాలు ఆర్థికంగా చితికి పోయాయి? వారికి ఏ విధంగా సాయం చేయాలి? రూ.లక్షతో పాటు మరింత ఆర్థిక సాయం అవసరమైతే ఏం చేయాలి? అందుకు ఏ మేరకు సబ్సిడీ ఇవ్వొచ్చు? అందరికీ ఒకేసారి సాయం చేయొచ్చా? అనే అంశాలను చర్చించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సబ్ కమిటీ అధ్యయనం చేయనున్నది. దీని కోసం ఈనెల 23న కమిటీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నది. దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా ఓ రోజు బీసీ వర్గాల కోసం కేటాయించి, ఆ రోజున వారికి ఆర్థిక సాయం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

వీఆర్ఏల రెగ్యులరైజ్‌కు ఆమోదం

వీఆర్ఏల ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా వారికి రెగ్యులరైజ్ పత్రాలు అందజేయాలని మీటింగ్‌లో నిర్ణయించారు. అయితే రెవెన్యూ, అగ్రికల్చర్‌తో పాటు ఇతర శాఖల్లో ఏ విధంగా అడ్జెస్ట్‌మెంట్ చేయాలనే దానిపై రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను కేబినెట్ ఆదేశించింది. వీఆర్ఏ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

111 జీవో ఎత్తివేత

హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలుగా పిలవబడే ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలోని భూముల్లో నిర్మాణాలపై ఇంతకాలం ఆంక్షలు విధిస్తూ జీవో 111 ఉండేది. ఈ జీవోను కేబినెట్ ఎత్తేసింది. దీంతో 84 గ్రామాల ప్రజలు లబ్ది పొందనున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో జరిగే నిర్మాణాలకు ఉన్న నిబంధలను ఆ గ్రామాలకూ వర్తించనున్నాయి. అయితే జంట జలాశయాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

ఘనంగా దశాబ్ది వేడుకలు

జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. తొమ్మిదేండ్లలో ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా ప్రయోజనం పొందిన లబ్దిదారులను ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేయనున్నారు. ప్రతి రోజూ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు. ఏయే రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలనే దానిపై త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

పంట కాలం సవరణ

ప్రతి ఏటా వడగండ్లతో పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఉగాది నాటికే పంట చేతికొచ్చే విధంగా పంట కాలన్ని సవరించే చాన్స్ ఉండాలని సూచించింది. ఇందుకోసం అధ్యయనం చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. ఈ సబ్ కమిటీ అగ్రికల్చర్ సైంటిస్టులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ కోరింది. అలాగే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, పోలీసు అధికారులను ఆదేశించింది.

కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు..

– ఆరోగ్య శాఖను రీఆర్గనైజేషన్‌కు ఆమోదం. మొత్తం 38 డీఎంఅండ్‌హెచ్‌వోల ఏర్పాటు. 33 జిల్లాల్లో డీఎంఅండ్‌హెచ్‌వో పోస్టుల శాంక్షన్. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరోగ్య శాఖను ఆరు జోన్లుగా ఏర్పాటు, ఆరు డీఎంఅండ్‌హెచ్‌వోల నియామకం.

– మక్కలు, జొన్నలు కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం తరుఫున గ్యారెంటీ ఇస్తూ నిర్ణయం

– అచ్చంపేట ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ -1, ఫేస్ -2 నిర్మాణాలకు ఆమోదం.

– రెండో విడత గొర్రెల పంపిణీని 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయం.

– వనపర్తి జర్నలిస్టు అసోసియేషన్‌కు 10 గంటల స్థలం కేటాయింపు.

– ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాల స్థలం కేటాయింపు.

– మైనార్టీ కమిషన్‌లో జైనులకు ప్రాతినిథ్యం కల్పిస్తూ నిర్ణయం.

– టీఎస్పీఎస్సీ‌లో 10 పోస్టులు మంజూరు.

Tags:    

Similar News