స్పీడ్ పెంచనున్న కేసీఆర్, కేటీఆర్.. తండ్రి కొడుకుల జిల్లాల పర్యటనలకు షెడ్యూల్ ఫిక్స్!
తండ్రీ కొడుకులు జిల్లాల పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ ఫస్ట్ వీక్ నుంచి జనం మధ్యకు వెళ్లేందుకు షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తండ్రీ కొడుకులు జిల్లాల పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ ఫస్ట్ వీక్ నుంచి జనం మధ్యకు వెళ్లేందుకు షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. కేడర్‌ను సన్నద్ధం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను ముమ్మరం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వీటిని ప్రచార అస్త్రాలుగా ఉపయోగించనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ మరింత స్పీడ్ పెంచనుంది. అందుకు ప్రణాళికలను రూపొందించింది. జూన్ ఫస్ట్ వీక్ నుంచి మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లాలని భావిస్తుంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల మధ్యకు వెళ్లిన బీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి నిర్వహిస్తుంది. అంతకు ముందే ప్రజల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెళ్లేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నారు. జూన్ 1న కామారెడ్డి, 2న సిరిసిల్ల పర్యటనకు కేటీఆర్ వెళ్లనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా సభలను నిర్వహించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి కేడర్‌లో జోష్ నింపనున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న నాలుగు జిల్లాల కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జూన్ 4న నిర్మల్ జిల్లా కలెక్టరేట్, 6న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు కార్యాలయం, 9న మంచిర్యాల, 12న గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాల్లో బహిరంగసభలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రగతితో పాటు కేంద్రం చూపుతున్న వివక్ష, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి అండగా ప్రజలు ఉండాలని కోరనున్నారు. తండ్రీకొడుకుల జిల్లాల పర్యటనలతో రాబోయే ఎన్నికలకు కేడర్ ను సన్నద్ధంతోపాటు పొలిటికల్ హీట్ పెంచనున్నారు.