అమిత్ షా మీటింగ్‌కూ కేసీఆర్ దూరం.. అదే రోజున రాష్ట్రంలో కీలక సమావేశం?
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సెప్టెంబరు 3న తిరువనంతపురంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరవుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సెప్టెంబరు 3న తిరువనంతపురంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరవుతున్నారు. దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఏపీ సీఎం జగన్ ఆబ్సెంట్ అవుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొనే కారణంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గైర్హాజరవుతున్నారు. గతేడాది నవంబరు 14న తిరుపతిలో జరిగిన సమావేశానికీ కేసీఆర్ హాజరుకాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ ఎజెండా పాయింట్లను కేంద్ర హోంశాఖకు తెలంగాణ పంపలేదు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 12 అంశాలను ప్రతిపాదించింది.
తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు దాటినా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలుచేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే విమర్శిస్తున్నారు. ఈ సమావేశంలో ఆ అంశాలన్నింటినీ చర్చకు తీసుకొచ్చి పరిష్కారం కనుగొనే దిశగా నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కానీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ వైరంతో ఈ సమావేశంలో అమిత్ షా, కేసీఆర్ ఒకరికొకరు ఎదురుపడే అవకాశం లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు మాత్రమే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్నారు. షెడ్యూలు 9, 10 జాబితాలో పేర్కొన్న సంస్థల విభజన, ఆస్తుల-అప్పుల పంపిణీపై ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్ర హోం శాఖ సైతం పరిష్కారం చేయలేకపోయింది.
విద్యుత్ బకాయిలే హాట్ టాపిక్ !
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నందున ఈ సమావేశంలో తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగే అవకాశం ఉన్నది. కేంద్ర హోంశాఖను సైతం తెలంగాణ తప్పుపట్టే అవకాశాలు ఉన్నాయి. ఏపీ జెన్‌కో సంస్థలకు బకాయి పడిన రూ. 6,756.92 కోట్లను నెల రోజుల వ్యవధిలో చెల్లించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ తాజాగా లేఖ రాయడం వేడిగానే చర్చకు దారితీసే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నదని తెలంగాణ ప్రతినిధులు ఈ సమావేశంలో వేలెత్తి చూపే అవకాశం ఉన్నది. గతేడాది నవంబరులో తిరుపతిలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా కేంద్రం ఈ లేఖ రాసిందనే అంశాన్ని తెలంగాణ గట్టిగా వినిపించాలనుకుంటున్నది.
విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి రూ. 6,627 కోట్ల మేర రావాల్సి ఉన్నదంటూ తిరువనంతపురంలో మే 18న జరిగిన కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. మూడేళ్ళ పాటు విద్యుత్‌ను సరఫరా చేసినందుకు అయిన ఖర్చుతో పాటు సకాలంలో చెల్లించకపోవడంతో విధించిన పెనాల్టీ సర్‌చార్జి కలిపి పేరుకుపోయిందని ఏపీ వివరించింది. కానీ తెలంగాణ మాత్రం కేవలం రూ. 4,887 కోట్లు మాత్రమే కట్టాల్సి ఉన్నదని, అదే సమయంలో ఏపీ నుంచి తమకు రూ. 17,828 కోట్లు రావాల్సి ఉన్నదని తెలంగాణ వాదించింది. రెండు రాష్ట్రాల మధ్య సర్దుబాట్ల అనంతరం తెలంగాణకే ఏపీ నుంచి రూ. 12,940 కోట్లు వస్తుందని సోమవారం రాత్రి రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కేంద్రమే టార్గెట్‌గా తెలంగాణ వాదనలు?
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశాలు లేకపోవడంతో అధికారులే రాష్ట్ర అంశాలపై చర్చించనున్నారు. ఏపీ తరఫున ఎజెండాలో చేర్చిన 12 అంశాల్లో కొన్ని కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన హక్కులు, నిధులతో పాటు తెలంగాణతో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలు కూడా ఉన్నాయి. టాక్స్ ఇన్‌సెంటివ్స్ విషయంలో తెలంగాణతో ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని ఎజెండా అంశంగా ఏపీ పొందుపర్చింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి పన్ను వసూళ్ళను రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే ఫార్ములాపై ఏర్పడిన వివాదం కూడా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లోనే ఉన్నది. తొమ్మిదవ షెడ్యూలులోని పలు సంస్థల విభజన విషయాలనూ ఎజెండాలో ప్రస్తావించింది.
మరోవైపు తెలంగాణ కూడా కేంద్ర హోంశాఖపై ఒత్తిడి పెంచే విధంగా వాదనలు వినిపించే అవకాశం ఉన్నది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం విభజన చట్టంలో స్పష్టమైన హామీ ఉన్నా మూడేళ్ళుగా ఆ నిధులు తెలంగాణకు అందకపోవడాన్ని లేవనెత్తనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. తొమ్మిదవ, పదవ షెడ్యూళ్ళలోని సంస్థల విభజన విషయంలో ఏపీ ప్రస్తావిస్తున్న వాదనలు సహేతుకంగా లేవని కేంద్రానికి తెలిసినా, కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయాన్ని వెల్లడించినా నిర్ణయాలు తీసుకోవడంలో తాత్సారం జరుగతున్నదంటూ కేంద్రాన్ని కార్నర్ చేసే అవకాశం ఉన్నది. ఇక ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలోనూ ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉన్నది.
ఇంకోవైపు తెలంగాణ తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టు విషయంలో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వినియోగించుకోవడంలో కర్నాటక లేవనెత్తే అంశంపైన కూడా చర్చ జరగనున్నది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇటీవల తెరపైకి వస్తున్న రాజకీయ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజన చట్టంలోని పలు అంశాలపై లోతుగానే చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఎనిమిదేళ్ళుగా పరిష్కరించకుండా ఉన్న అంశాలను రానున్న రెండేళ్ళ వ్యవధిలో కొలిక్కి తీసుకురావడం కేంద్ర హోంశాఖకు తప్పనిసరిగా మారింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గడచిన ఎనిమిది నెలల్లో జరిగిన పరిణామాలన్నింటిపై తెలంగాణ, ఏపీ, కేంద్ర హోంశాఖ ప్రతినిధుల మధ్య వేడిగా చర్చలకు దారితీసే అవకాశం ఉన్నది.
Also Read : ఆర్‌టీఐను అస్త్రంగా చేసుకున్న రాష్ట్ర టీం.. పోరుబాటకే బీజేపీ నిర్ణయం..