పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టండి.. సీఎస్‌కు సీఎల్పీ నేత రిక్వెస్ట్
హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు.
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎస్శాంతికుమారితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్మల్లు రవిలు భేటీ అయ్యారు. పంజాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని సీఎస్‌ని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పంజాగుట్టలో పెట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం దారుణమన్నారు. ఇప్పటికే ఆ విగ్రహాన్ని వీహెచ్ హనుమంతరావుకు అప్పగించాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చినా, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టడం అవమానించడమేనని భట్టి చెప్పారు. అంబేడ్కర్‌కు అవమానం చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలుగా చూస్తూ ఊరుకోలేమన్నారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం బాధకరమన్నారు. వీహెచ్మాట్లాడుతూ.. పంజాగుట్ట వద్దనే అంబేద్కర్ విగ్రహం పెట్టాలని దళితులంతా కోరుతున్నారని సీఎస్‌కు వివరించామన్నారు. విగ్రహం పెట్టే వరకు తన పోరాటం ఆగదన్నారు.