Flood relief Fund : పదో తరగతి విద్యార్థిని పెద్ద మనసు.. వరద బాధితులకు కిడ్డీ బ్యాంకు డబ్బులు
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లడంతో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లడంతో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరద బాధితులకు అండగా పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు తన వంతు సహాయం చేసింది. ‘సీఎం అంకుల్ నమస్తే, సీఎం సహాయనిధికి నా వంతు సహాయం రూ. 3 వేలు ఇస్తున్నాను.’ అంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల సమక్షంలో కవర్ అందజేసింది.
అయితే, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు తన కిడ్డీ బ్యాంకులో జమ చేసిన డబ్బులు వరద బాధితులకు తన వంతు సాయంగా సీఎంకు అందజేసి గొప్పమనసు చాటుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ అమ్మాయిని అభినందించారు. వరద సాయంపై విద్యార్థిని సాయి సింధును పలువురు అభినందిస్తున్నారు. చిన్న వయసులో పెద్ద మనసు చాటుకుందని సింధును పలువురు ప్రశంసించారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతా వేదికగా ఈ విషయాన్ని ప్రత్యేకంగా పంచుకున్నారు. ‘చిన్న వయసైనా.. పెద్ద మనసున్న చిట్టితల్లి ముత్యాల సాయి సింధు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని వరద బాధితుల సహాయార్థం.. తన కిట్టీ బ్యాంకు నుంచి రూ.3 వేలు అందజేసింది. సాయి సింధుకు నా అభినందనలు’ అని ఫోటోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు సాయి సింధుకు కామెంట్ల రూపంలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.