వికారాబాద్‌లో భగ్గుమన్న BRS విభేదాలు.. బీభత్సం సృష్టించిన MLA అనుచరులు (వీడియో)
వికారాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ నేతల విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
దిశ, ప్రతినిధి వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ నేతల విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు గ్రూపుల మధ్య కుమ్ములాట జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం జిల్లా కేంద్రంలోని నాగేష్ గుప్తా ఫామ్ హౌస్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. అది కాస్త ముదిరి ఘర్షణకు దారి తీసింది. అధికారం చేతిలో ఉందనే గర్వంతో ఎమ్మెల్యే అనుచరులు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సమావేశం కోసం ఏర్పాటు చేసుకున్న టెంట్లు, కుర్చీలు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని అసమ్మతి వర్గ నాయకులు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే ఆనంద్ జిందాబాద్ అంటూ ఎమ్మెల్యే వర్గీయులు నినాదాలు చేయగా, కేసీఆర్ జిందాబాద్ అంటూ మరో వర్గం నేతలు నినాదాలు చేశారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక డీఎస్పీ, సిబ్బంది సాయంతో రెండు వర్గాలను చెదరగొట్టారు.