విజయారెడ్డి వర్సెస్ విజయలక్ష్మి.. సీఎం రేవంత్ దృష్టికి గొడవ!

గాంధీభవన్‌లో బుధవారం జరిగిన హైదరాబాద్ జిల్లా ముఖ్య నాయకుల మీటింగ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్ నేతృత్వం

Update: 2024-10-16 17:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీభవన్‌లో బుధవారం జరిగిన హైదరాబాద్ జిల్లా ముఖ్య నాయకుల మీటింగ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్ నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకునే సమయంలో కార్పొరేటర్ విజయారెడ్డి, మేయర్ విజయలక్ష్మిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఖైరతాబాద్‌లో పార్టీ స్ట్రాంగ్‌గా ఉన్నదని మేయర్ వివరించగా, గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని విజయారెడ్డి పీసీసీకి తెలియజేశారు. దీంతో “నీకేమీ తెలియదు. యూ ఆర్ ఏ డాగ్” అంటూ కార్పొరేటర్ విజయారెడ్డిపై మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయినట్లు తెలిసింది. ఇరువురు మధ్య పరుషపదాలతో వాగ్వాదం జరుగగా, సీనియర్ నాయకులు జోక్యం చేసుకొని గొడవను సద్దుమణిగేలా చేశారు. పీసీసీ చీఫ్ ముందే వీరిద్దరు గొడవకు దిగడం చర్చనీయాంశమైంది. గాంధీభవన్‌లో జరిగిన లొల్లి విషయాన్ని తెలుసుకున్న ఇద్దరి మహిళా నేతల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ నేతకు మర్యాద ఇవ్వలేదంటూ ఒక వర్గం, కావాలనే రచ్చ చేస్తున్నారని మరో వర్గం ఒకరిపై ఒకరు సోషల్ మీడియాల్లో విమర్శలు చేస్తున్నారు. ఈ అంశం సీఎం దృష్టికి వెళ్లినట్లు పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత చెప్పారు.

ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల అంశంలో వేటు పడే ఛాన్స్ ఉన్నదని ఎక్స్ పర్ట్స్, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ అసెంబ్లీ టిక్కెట్ కోసం మేయర్ విజయలక్ష్మీ తనదైన శైలిలో ఇప్పట్నుంచే ప్రయత్నిస్తుండగా, ఈ సీటు తనదేనంటూ విజయారెడ్డి పట్టుపడుతున్నారు. దానం పక్కకు వెళ్లగానే ఈ సీటు నుంచి పోటీ చేసి గెలవాలని ఇద్దరు మహిళా లీడర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు ఎన్నికల కోసం కూడా ప్రిపరేషన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. పైగా విజయారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే మేయర్‌గా విజయలక్ష్మీని ఎంపిక చేశారు. ఆ టైమ్‌లో బీఆర్‌ఎస్‌పై విజయారెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసింది. అప్పట్నుంచే ఈ ఇద్దరి మహిళా నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా విభేదాలు ఉన్నాయని ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిగ్ డిస్కషన్.


Similar News