Jajula Srinivas Goud: ఆ రెండు పార్టీలకు మద్దతు ఇవ్వొద్దని ఓపెన్‌గా పిలుపునిస్తాం

కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని జీవో జారీచేసినా దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Update: 2024-10-16 17:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని జీవో జారీచేసినా దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి వారి వైఖరిని వెల్లడించకుండా మౌనంగా ఉన్నారని, స్పందించకుంటే ఆ రెండు పార్టీలను బీసీ వ్యతిరేకమైనవిగా బహిరంగంగా ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కులగణనపై వారిద్దరూ మౌనం వీడాలని, ఈ నెల 20న జరిగే అఖిలపక్ష సమావేశంలో నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చామని, హైకోర్టును ఆశ్రయించామని, చివరకు ఆ కేసు ఫలితంగానే రాష్ట్ర సర్కార్ జీవో (నెం. 18)ని జారీచేసిందని ఆయన గుర్తుచేశారు. ఆరు నెలల పోరాటం ఫలించిందని నగరంలోని ఆలీ కేఫ్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే విగ్రహానికి పూల దండ వేసిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం జీవో జారీ చేసి వారం రోజులు కావస్తున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తన వైఖరిని వెల్లడించలేదని జాజుల శ్రీనివాస గౌడ్ గుర్తుచేశారు. బీసీలు దీర్ఘకాలంగా 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారని, ఇప్పుడు కులగణన ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నా దానిపైన స్పందించకపోవడం బీసీ వ్యతిరేక ధోరణికి నిదర్శనమనే అనుమానం కలుగుతున్నదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే అభిప్రాయానికి రావాల్సి వస్తుందన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి సైతం సైలెంట్‌గా ఉండడాన్ని బీసీ సంఘాలన్నీ గమనిస్తున్నాయని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీజేపీపైన కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. కులగణనపై అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోడానికి ఈ నెల 20న నగరంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, కులగణన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నామని, ఆ సమావేశానికి హాజరై పార్టీ విధాన నిర్ణయాన్ని, వైఖరిని వెల్లడించాలని బీఆర్ఎస్, బీజేపీలను శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా కులగనణపై సానుకూలంగా స్పందించి ఆ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు సహకరించాలని, కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి రాజకీయ విభేదాలున్నా బీసీలపక్షాన నిలవాలని శ్రీనివాస గౌడ్ డిమాండ్ చేశారు. ఎలాంటి విభేదాలు సృష్టించవద్దని సూచించారు. బీసీ కులగణన ప్రక్రియను ఎవరు వ్యతిరేకించినా, అడ్డుకోవాలని చూసినా భారీ స్థాయిలో రాజకీయ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాజిటివ్ వైఖరిని ప్రదర్శించకపోతే రాష్ట్రంలోని బీసీ ప్రజలు, ఓటర్లందరికీ తమ సంఘంతో పాటు మరికొన్ని బీసీ సంఘాలను కలుపుకుని బీఆర్ఎస్, బీజేపీలు సిద్ధాంతపరంగానే బీసీ వ్యతిరేక పార్టీలనే మెసేజ్‌ను ఇవ్వాల్సి వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీల మద్దతుదార్లను ఓడించాలని పిలుపు ఇవ్వక తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, ఎస్ దుర్గయ్య, మాదేశి రాజేందర్, గూడూరు భాస్కర్, సంధ్యారాణి, మహేష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Similar News