ధాన్యం సేకరణలో కేంద్రం నిబంధనలు అడ్డుగా ఉన్నాయి.. సివిల్ సప్లై వీసీ, ఎండీ అనిల్ కుమార్

ధాన్యంలో 17కు పైగా తేమ శాతం ఉంటే కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అడ్డుగా ఉన్నాయని సివిల్ సప్లై కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ అనిల్ కుమార్ పేర్కొన్నారు.

Update: 2023-05-12 12:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యంలో 17కు పైగా తేమ శాతం ఉంటే కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అడ్డుగా ఉన్నాయని సివిల్ సప్లై కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. వరి సేకరణలో ఆలస్యం జరగడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని వస్తున్న వార్తలపై శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేకుండా యాసంగి సీజన్‌లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రైతులకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 7,175 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 7.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేశామన్నారు.

ఈ ఏడాది గురువారం వరకు 19.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 3.40 లక్షల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 17 శాతం లోపు ఉంటే తక్షణమే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. 19.62 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ 18.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం జరిగిందన్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని స్పష్టంచేశారు.


Tags:    

Similar News

టైగర్స్ @ 42..