తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన
రాష్టంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఈ నెల 28 నుండి ఇచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టిందని వస్తున్న వార్తలపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు.
దిశ ,తెలంగాణ బ్యూరో: రాష్టంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఈ నెల 28 నుండి ఇచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టిందని వస్తున్న వార్తలపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో, ఇతర ప్రచార మాధ్యమాల్లో రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంశాన్ని అధికారులు ఖండించారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో.. ఎవరు ఇలా చేస్తున్నారో తమకు తెలియడంలేదని తలబాదుకుంటున్నారు. తమకు ఉదయం నుండి కార్యాలయానికి వందల ఫోన్‌లు వస్తున్నాయని అధికారులు వాపోయారు. ఉన్నతాధికారులుగా తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు.
ఈ నెల 12వ తేదీన పౌర సరఫరా శాఖమంత్రి ఉత్తమకుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కుడా కొత్త రేషన్ కార్డుల పంపిణి, పెండింగ్ రేషన్ కార్డులపై నిర్ణయం ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో అలాగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని అధికారులు కుడా ధ్రువీకరించారు. తమకు మంత్రి నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని వెల్లడించారు. ప్రభుత్వం నుండి ఏమైనా అధికారిక సమాచారం వస్తే తామే చెబుతామని, తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాలలో వచ్చిన వాటికీ తాము ఏమి సమాధానం చెప్పలేమని అధికారులు తెలిపారు. ఇటువంటి పుకార్లను ప్రజలు నమ్మద్దని వెల్లడించారు.